|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:31 PM
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సహ యజమానిగా ఉన్న కొత్త రెస్టారెంట్ 'అమ్మకాయి' వద్ద భారీ రద్దీ నెలకొంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచితంగా టిఫిన్ అందిస్తామని ప్రకటించడంతో, ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ రెస్టారెంట్ ముందు ప్రజలు బారులు తీరారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.వివరాల్లోకి వెళితే, జనవరి 26న రిపబ్లిక్ డేను పురస్కరించుకుని, లాంచింగ్ ఆఫర్ ప్రకటించారు. ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ఉచితంగా దోసె, ఇడ్లీ వంటి దక్షిణ భారతీయ వంటకాలను అందిస్తామని తెలిపారు. అయితే, ఈ ఆఫర్ కోసం ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది క్యూలో నిలబడ్డారు. ఊహించని రద్దీ కారణంగా ఆఫర్ సమయాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించినప్పటికీ, చాలా మంది నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, ఉచిత ఆఫర్ కోసం క్యూలో కొందరు ధనికులు కూడా నిల్చుని ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఉచిత ఆఫర్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు దీనిని మంచి కార్యక్రమంగా అభివర్ణిస్తూ, రిపబ్లిక్ డే నాడు ఆకలితో ఉన్నవారికి సహాయం చేశారని ప్రశంసించారు. అయితే, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఉచిత ఆహారం కోసం ప్రజలు ఇలా గంటల తరబడి క్యూలలో నిలబడటాన్ని తప్పుబట్టారు. ఇది 'ఉచితాల సంస్కృతి'ని ప్రోత్సహించడమేనని అభిప్రాయపడ్డారు.
Latest News