|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:40 PM
తమిళ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ కింగ్ నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాగార్జున వయసులో ఏమాత్రం మార్పు రాలేదని, ఆయనకు అసలు వయసు ఎందుకు పెరగడం లేదో తనకు అర్థం కావట్లేదని చమత్కరించారు. జియో హాట్‌స్టార్ నిర్వహించిన ‘సౌత్ అన్‌బాండ్’ కార్యక్రమంలో ఈ సరదా సంభాషణ చోటుచేసుకుంది.ఈ కార్యక్రమంలో నాగార్జున, మోహన్‌లాల్‌తో కలిసి విజయ్ సేతుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జునను ఉద్దేశించి మాట్లాడుతూ, "నా చిన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలానే ఉన్నారు. యాంటీ ఏజింగ్‌పై పరిశోధనలు చేసేవాళ్లు ఆయన్ని కొన్ని రోజులు తీసుకెళ్లి పరీక్షలు చేయాలి. ఆయన జుట్టు, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. నాకు మనవళ్లు పుట్టి, వాళ్లు పెద్దవాళ్లయినా సరే నాగార్జున ఇలానే యంగ్‌గా ఉంటారు" అని సరదాగా వ్యాఖ్యానించారు.ఇదే వేదికపై తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ కార్యక్రమం గురించి కూడా విజయ్ సేతుపతి మాట్లాడారు. ఇలాంటి షోలకు యాంకర్‌గా ఉండటం చాలా తేలికని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజల ప్రవర్తనను దగ్గర నుంచి గమనించే అవకాశం దొరికిందని తెలిపారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళ బిగ్‌బాస్ సీజన్ 8కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Latest News