|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 11:12 AM
జలమండలి ఓ అండ్ ఎం డివిజన్-4, బేగంబజార్ లోని సమస్యాత్మకమైన ప్రాంతాలను ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. మొదటగా ఉస్మాన్ గంజ్ లో 400 మి.మీ. ఆర్‌సీసీ సీవర్ బీ–90 ప్రధాన సీవర్ లైన్ డీప్ మాన్ హోల్ శిథిలమైపోవడంతో అవుట్ లెట్ లేక సీవరేజ్ రహదారిపై పొంగడంతో అధికారులు కొత్త మాన్ హోల్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి డీప్ మాన్ హోల్ పునర్నిర్మాణ పనులను పరిశీలించి, శాశ్వత పరిష్కరానికి అధికారులతో చర్చించారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేస్తూ సమగ్ర సీవరేజ్ నెట్‌వర్క్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే ఫీల్‌ఖానా, ఉస్మాన్ గంజ్, బేగంబజార్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ వాననీటి కాలువ ఉండడం, కొన్ని సీవరేజ్ లైన్లు వాననీటి కాలువ అనుసంధానం అయినట్టు గుర్తించారు.
దీంతోపాటు ఉస్మాన్ గంజ్ ప్రధాన రహదారిపై గత 4 సంవత్సరాల క్రితం కోవిడ్ సమయంలో జీహెచ్ఎంసీ కొత్త రోడ్, నాలా పైకప్పు నిర్మించే క్రమంలో.. పైపు లైన్ తో పాటు కొన్ని మ్యాన్ హోల్స్ ధ్వంసం చేసి నాలా లోకి మళ్లించింది. వర్షా కాలంలో అందులో పూడిక పేరుకుపోయి.. మరికొన్ని సీవరేజ్ లైన్లు వెనక్కి వచ్చి ఈ ప్రాంతాల్లో తరుచూ మురుగు రహదారులపైకి పొంగుతోంది. ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడానికి ధ్వంసమైన మ్యాన్ హోళ్లను పునర్మించి, రోడ్డులో పూడికుపోయిన మ్యాన్ హోళ్లను గుర్తించి డీ సిల్టింగ్ చేసి రోడ్డు మీద పారుతున్న మురుగును ఈ డ్రెయిన్ కి మళ్లించి శాశ్వత పరిష్కారంగా ఉస్మాన్ గంజ్ బ్రిడ్జి అవతల వైపున్న జలమండలి సీవరేజ్ లైన్ కు కొత్త కనెక్టివిటీ పైపు లైన్ ను నిర్మించాలని, జిహెచ్ఎంసి అధికారులతో సమన్వంతో పని చేయాలని సూచించారు. అలాగే వర్షపు నీటి కాల్వలో మురుగు చేరకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాంటి పాయింట్లను గుర్తించి వర్షపు నీటి కాల్వ నుంచి సీవరేజ్ లైన్ ను వేరు చేసి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.