|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 07:23 AM
మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల జిల్లా కోరుట్లలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టికెట్ వేటలో ఉన్న ఒక నాయకుడు కేవలం 12 గంటల వ్యవధిలోనే రెండు పార్టీల కండువాలు కప్పుకోవడం ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.కోరుట్ల పట్టణంలోని 8వ వార్డు నుంచి పోటీ చేయాలని తోట గంగాధర్ భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. గురువారం ఉదయం స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్గంగాధర్ ఇంటికి వెళ్లి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో గంగాధర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అందరూ భావించారు.గంగాధర్ చేరిక విషయం తెలియగానే కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. గెలిచే గుర్రాన్ని వదులుకోకూడదని భావించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు, రాత్రికి రాత్రే ఆయనతో చర్చలు జరిపారు. 8వ వార్డు టికెట్ గంగాధర్‌కే ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన మనసు మార్చుకున్నారు. మెట్‌పల్లిలోని పార్టీ కార్యాలయంలో తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకుని 'సొంత గూటికి' చేరుకున్నారు.