|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 04:42 PM
భారత పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దేశంలో వ్యాపారం చేయాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని, రాజ్యాంగ విలువలను, నిబంధనలను పాటించి తీరాలని స్పష్టం చేసింది. రాజ్యాంగ నిబంధనలను పాటించకుంటే దేశం విడిచి వెళ్లాల్సిందేనని వాట్సాప్ మాతృసంస్థ మెటాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఈ రోజు జరిగిన విచారణలో వాట్సాప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనల విషయంలో వాట్సాప్ తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయింది. వాట్సాప్ యూజర్ల వివరాలను, డేటాను మెటాతో పంచుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.డేటా షేరింగ్, మార్కెట్ ఆధిపత్యానికి సంబంధించి గత నెలలో ఎన్టీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వాట్సాప్, మెటా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహా పలువురు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సాప్ పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు మా దేశ పౌరుల గోప్యతతో ఆడుకోలేరు. మా డేటాలో ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మేము అనుమతించబోము’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అమెరికా సంస్థ మెటాకు తేల్చిచెప్పారు. భారత చట్టాలను పాటించలేకపోతే దేశం వదిలి వెళ్లాలని సూచించారు.