|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 08:37 PM
మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, నటించిన 'కన్నప్ప' చిత్రంపై ప్రముఖ తమిళ నటుడు సూర్య ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా విజయం సాధించిన సందర్భంగా విష్ణుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. దీనిపై విష్ణు మంచు సామాజిక మాధ్యమ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.సోమవారం, విష్ణు మంచుకు సూర్య ఒక పూల బొకేతో పాటు అభినందన సందేశం పంపారు. "ఈ అద్భుతమైన మైలురాయికి బిగ్ కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్ విష్ణు. నీ ప్యాషన్, కష్టం, నమ్మకం ఫలించాయి. ఎన్నో హృదయాలను హత్తుకునే సినిమా తీసినందుకు గర్వంగా ఉంది" అని సూర్య తన సందేశంలో పేర్కొన్నారు.విష్ణు స్పందిస్తూ, "బిగ్ బ్రదర్ సూర్య మీ సందేశానికి ధన్యవాదాలు. స్ఫూర్తి కోసం నేను ఎప్పుడూ మీ సినిమాలనే చూస్తాను. మీ నుంచి ఇలాంటి సందేశం రావడం నాకు దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటి" అని బదులిచ్చారు.తన చిత్రం 'కన్నప్ప' పైరసీ బారిన పడిందని విష్ణు అంతకుముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రియమైన సినీ ప్రియులారా, కన్నప్పపై పైరసీ దాడి జరుగుతోంది. ఇప్పటికే 30,000 పైగా చట్టవిరుద్ధమైన లింకులను తొలగించాం. ఇది చాలా బాధాకరం. పైరసీ అంటే దొంగతనమే. దయచేసి దానిని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో సినిమాను ఆదరించండి" అని ప్రేక్షకులను కోరారు.
Latest News