|
|
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 05:00 PM
నిన్న మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారని, ఈ విషయాన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగ్ మధ్యలోనే లేచి హైదరాబాద్ కి పయనమయ్యాడని ఇలా పలు రకాల వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్వయంగా మెగా బ్రదర్ నాగబాబు చెప్పడంతో ఈ గాలి వార్తలకు చెక్ పడింది. కేవలం సోషల్ మీడియా లోనే కాదు,నేషనల్ మీడియా లో కూడా ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన నేషనల్ మీడియా ఒక వార్తని ప్రచారం చేసే ముందు, అది నిజమా కాదా అని ధ్రువీకరణ చేసుకోలేరా?, ఇంత నిర్లక్ష్యమా అంటూ సోషల్ మీడియా లో మెగా అభిమానులు మీడియా పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అదేమిటంటే నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళాడు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్లడం కూడా చర్చనేనా అని మీరంతా అనుకోవచ్చు. కానీ ఉప ముఖ్యమంత్రి స్థానం లో కూర్చున్న పవన్ కళ్యాణ్ కు ఎన్నో ముఖ్యమైన పనులు ఉంటాయి. ఆ పనులు మానుకొని తన అన్నయ్య కుటుంబం తో కలిసి ఉండేంత సమయం ఆయన వద్ద లేదు. కానీ ఇలాంటి సమయంలో ఆయన చిరంజీవి ఇంటికి వెళ్లాడంటే కచ్చితంగా ఎదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని అంటున్నారు. కచ్చితంగా తల్లి ఆరోగ్యం మ్యాటర్ మాత్రం కాదు. మరో ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికే వెళ్ళాడు. ఆ విషయం మరేమిటో కాదు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే విషయం. రాజ్య సభ ఆఫర్ చిరంజీవి కి ఎప్పటి నుండో ఉంది. కానీ ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి లేకపోవడంతో దానిని రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. కానీ తన అన్నయ్యని ఉన్నతమైన స్థానం లో చూడాలి అనేది పవన్ కళ్యాణ్ కోరిక. అందుకే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, తన అన్నయ్య ని ఒప్పించి రాజ్య సభ లోకి అడుగుపెట్టేలా చేయబోతున్నాడని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. ఇందుకోసమే పవన్ కళ్యాణ్ నిన్న అత్యవసరంగా చిరంజీవి తో భేటీ అయ్యాడని, ఆ తర్వాత ఢిల్లీ కి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని టాక్. మరో పక్క చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత గవర్నర్ అబ్దుల్ నజీర్ కాల పరిమితి మరో రెండేళ్లలో ముగియనుంది. ఈ పదవి కాలం ముగిసిన వెంటనే చిరంజీవి ని ఆ స్థానం లో కూర్చోబెట్టే ప్రయత్నం లో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్దం అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Latest News