|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:05 AM
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి కృష్ణ నట వారసుడిగా ఆయన పెద్దకుమారుడు రమేశ్ బాబు చిత్రసీమలోకి హీరోగా పరిచయం అయ్యాడు. మహేశ్ బాబు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చినా... కృష్ణ తన పెద్ద కొడుకు రమేశ్ బాబు మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగా అతనితో కొన్ని సినిమాలు తీశాడు. అయితే నటన మీద పెద్దంత మక్కువ లేని రమేశ్ బాబు తెర చాటుకు వెళ్ళిపోగా, మహేశ్ బాబు 'రాజకుమారుడు' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఇదిలా ఉంటే రమేశ్ బాబు మరణానంతరం అతని కుమారుడు జయకృష్ణ నటనలో శిక్షణ తీసుకుని ఇప్పుడు జనం ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో జెమినీ కిరణ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఆర్.ఎక్స్. 100' (RX 100) ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. జీవీ ప్రకాశ్ దీనికి సంగీతం అందిస్తున్నారు. 'శ్రీనివాస మంగాపురం' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత అశ్వనీదత్ ఓ గ్రేడ్ అప్ డేట్ ను అందించారు. కృష్ణతో పాటు మహేశ్ బాబుతోనూ సినిమాలను నిర్మించిన అశ్వనీదత్ ఇప్పుడు ఘట్టమనేని వంశంలో మూడో తరం హీరోతో సినిమా చేస్తున్నారు. గతంలోనూ ఆయన నందమూరి, అక్కినేని కుటుంబాలకు సంబంధించి మూడు తరాల హీరోలతో సినిమాలు నిర్మించారు.ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'శ్రీనివాస మంగాపురం' సినిమాను కృష్ణ జయంతిని పురస్కరించుకుని 2026 మే నెలాఖరులో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. కృష్ణ జయంతి మే 31. 2026 లో మే 31 ఆదివారం వచ్చింది. సో... దానికి రెండు రోజుల ముందు మే 29, శుక్రవారం నాడు 'శ్రీనివాస మంగాపురం' జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది.
Latest News