|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:59 PM
ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితులలో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో రూపొందిన 'సంగమర్మర్' సిరీస్, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి హిందీతో పాటు ఇతర భాషలలోను అందుబాటులోకి వచ్చింది. సౌరభ్ రాజ్ .. షీన్ సవితా దాస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కథ ఏమిటనేది చూద్దాం.
'ఆగ్రా'లో నీరజ్ గోయెల్ అనే వ్యాపారి ఉంటాడు. అతని భార్యనే వసుంధర. వారి సంతానమే అమృత ( షీన్ సవితా దాస్) అభినవ్ .. ప్రీతి .. చారు. అదే కాలనీలో ఆదిత్య (సౌరభ్ రాజ్) తన తల్లి నిర్మలతో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఒక చిన్న క్లినిక్ పెట్టుకుని డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అతను .. అమృత ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక 'హోలీ' పండుగ రోజున ఈ విషయం వసుంధరకి తెలుస్తుంది. ఆదిత్య మంచివాడనే అభిప్రాయం ఉండటం వలన ఆమె అమృతను మందలించలేకపోతుంది. వసుంధర భర్త నీరజ్ గోయెల్ తన స్థాయికి మించిన ఒక ప్రాజెక్టును మొదలుపెడతాడు. అందుకోసం పెద్ద మొత్తంలో అప్పులు చేస్తాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోతుంది. దాంతో అప్పుల వాళ్లు తమ బాకీ చెల్లించమని వేధిస్తూ ఉంటారు. ఈ విధమైన సమస్యలతో అతను సతమతమవుతూ ఉంటాడు. ఆదిత్యతో అమృత పెళ్లి విషయం గురించి నీరజ్ తో మాట్లాడాలని వసుంధర అనుకుంటుంది. అయితే ఆ విషయం చెప్పకుండానే హార్ట్ ఎటాక్ తో ఆమె చనిపోతుంది. అసలే సమస్యల్లో ఉన్న నీరజ్, భార్య మరణంతో మానసికంగా మరింత దెబ్బతింటాడు. తండ్రి ఆందోళనకి కారణం తెలుసుకున్న అమృత, ఆయనని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను సూసైడ్ చేసుకోవడంతో అయోమయంలో పడుతుంది. ఒక వైపున ఇంటిమీదకి వచ్చే అప్పులవాళ్లు .. ఒక వైపున పదేళ్లలోపు వయసున్న తమ్ముడు .. చెల్లెళ్లు. అవసరానికి ముఖం చాటేసిన బంధువులు. అలాంటి పరిస్థితులలో అమృత ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఆదిత్యతో ఆమె వివాహం జరుగుతుందా? లేదా? అనేది మిగతా కథ.
Latest News