|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:57 PM
సినీ నిర్మాత, ఏషియన్ టింబర్ ఎస్టేట్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావుకు సంబంధించి ఒక విశేష సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల చెన్నైలో దివంగత ఎన్టీఆర్ నివాసాన్ని కొనుగోలు చేసి మ్యూజియంగా మారుస్తున్న చదలవాడకు, తాజాగా హైదరాబాదు, కొల్లూరులోని తన టింబర్ ఎస్టేట్‌లో అత్యంత ఆసక్తికర అనుభవం ఎదురైంది. ఎప్పటిలాగే గత శనివారం వారి టింబర్ ఎస్టేట్‌లో సిబ్బంది కలప దుంగలను కటింగ్ మిషన్‌పై ఉంచి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక దుంగను కట్ చేయగా.. ఆ రెండు చెక్క ముక్కలపైనా మనిషి పాదాలను పోలిన ఆకృతి స్పష్టంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని తమ యజమాని చదలవాడ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు.దాంతో, చదలవాడ శ్రీనివాసరావు, ఆయన సోదరుడు తిరుపతిరావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దుంగపై ఉన్న పాదాల ఆకృతులను పరిశీలించి, అవి తమ ఇలవేల్పు అయిన తిరుమల శ్రీవారి పవిత్ర చరణాలేనని భావించి భక్తిపారవశ్యంతో సాష్టాంగ నమస్కారం చేశారు. "మా ఇలవేల్పు ఆ వెంకటేశుడే తన మహిమాన్విత చరణాలతో మా ఇంటిని పవిత్రం చేశాడు. ఇది మా పూర్వజన్మ సుకృతం. ఆ చరణాలను ఇక్కడే ఉంచి నిత్య పూజలతో ఆరాధిస్తాం" అని శ్రీనివాసరావు తెలిపారు.
Latest News