|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 03:40 PM
శివకందుకూరి కథానాయకుడిగా నటించిన సినిమా 'నవాబ్ కేఫ్'. ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాతో తేజు అశ్విని కథానాయికగా పరిచయమైంది. ఓటీటీ హక్కులను 'ఈటీవీ విన్' దక్కించుకుంది. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది.
ఇక కథ విషయానికొస్తే ... రాజా (శివ కందుకూరి) హైదరాబాద్ పాత బస్తీకి చెందిన యువకుడు. అతని ముత్తాతల కాలానికి చెందిన మూర్తి, గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వెళతాడు. 'టీ' పెట్టడంలో ఆయనకి గల ప్రావీణ్యం నవాబ్ అభిమానాన్ని సంపాదించిపెడుతుంది. ఆయన పనితీరును మెచ్చుకుంటూ నవాబ్ రాసిచ్చిన ఆస్తులు రాజా పెదనాన్న సొంతమవుతాయి. రాజా తండ్రి రంగనాథం (రాజీవ్ కనకాల)కి టీ దుకాణం మాత్రమే మిగులుతుంది. తన పూర్వీకుల మాదిరిగా 'టీ' పెట్టడం ఆయన ప్రత్యేకత. నవాబ్ ప్రశంసలు అందుకున్న కారణంగా అప్పటి నుంచి అది 'నవాబ్ కేఫ్'గా పిలవబడుతూ ఉంటుంది. తన తరువాత తన వారసుడిగా ఆ కేఫ్ ను రాజా నడపాలనేది రంగనాథం కోరిక. అయితే ఇంజనీరింగ్ పూర్తిచేసిన రాజా, అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అవసరమైన డబ్బును ఏర్పాటు చేసుకోవడానికి స్నేహితుడు సీజర్ (రాజ్ కుమార్ కసిరెడ్డి)తో కలిసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో పరిచయమైన సఖి (తేజు అశ్విని)తో ప్రేమలో పడతాడు. ఈ నేపథ్యంలోనే రాజా పెదనాన్న కొడుకైన కుమార్ (చైతన్య కృష్ణ) కన్ను, 'నవాబ్ కేఫ్' బిల్డింగ్ పై పడుతుంది. తనకు మాదిరిగానే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే, ఆ బిల్డింగ్ ను తనకి 50 కోట్లకు అమ్మేయమని రాజాను అడుగుతాడు కుమార్. దాంతో 'నవాబ్ కేఫ్'ను అమ్మాల్సిందేనని తండ్రితో రంగనాథం గొడవపడతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సంఘటనతో రాజా జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ.
Latest News