|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 03:46 PM
తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న భామ ప్రియాంక అరుళ్ మోహన్. అలాంటి ప్రియాంక తాజాగా తాజాగా నటించిన సినిమా పేరే 'మేడ్ ఇన్ కొరియా'. ఓటీటీలలో కొరియన్ కంటెంట్ కి ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోతున్న సమయంలో, కొరియా నేపథ్యంలో ఈ సినిమా రూపొందడం విశేషం. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది.
శెన్బా (ప్రియాంక అరుళ్ మోహన్) తమిళనాడులోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన యువతి. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేని ఒక విలేజ్ లో ఆమె నివసిస్తూ ఉంటుంది. కొండ ప్రాంతంలోని ఆ గ్రామంలో ఆమె తండ్రి ఒక చిన్నపాటి హోటల్ నడుపుతూ ఉంటాడు. చాలాకాలం క్రితం కన్యాకుమారి నుంచి కొరియా వెళ్లిన ఒక రాణిగారి పాత్రను స్కూల్ వార్షికోత్సవంలో శెన్బా పోషిస్తుంది. ఆ పాత్ర ఆమెపై చాలా ప్రభావం చూపిస్తుంది. అప్పటి నుంచి ఆమెకి 'కొరియా' చూడాలనే ఒక కోరిక పుడుతుంది. వయసుతో పాటే ఆ కోరిక బలపడుతుంది. శెన్బా కి కొరియా వెళ్లాలనే కోరిక ఎంత బలంగా ఉందనేది ఆమె పేరెంట్స్ కి తెలుసు. అందువలన సాధ్యమైనంత త్వరగా ఆమె పెళ్లి చేసేయాలని వాళ్లు నిర్ణయించుకుంటారు. ఈ విషయం తెలియగానే వెంటనే వెళ్లి 'మణి'ని కలుస్తుంది శెన్బా. తమ ప్రేమ విషయం తన తండ్రితో మాట్లాడమని ఒత్తిడి చేస్తుంది. 'బార్' లో పనిచేస్తున్న తనతో పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోడని 'మణి' అంటాడు. ఆమెకి ఇష్టమైన కొరియానే వెళ్లి అక్కడ స్థిరపడదామని మాట ఇస్తాడు. తల్లిదండ్రులతో చెప్పకుండా 'మణి'తో కలిసి శెన్బా కొరియా బయల్దేరుతుంది. అయితే తనని అతను మోసం చేశాడనే విషయాన్ని చివరి నిమిషంలో ఆమె గ్రహిస్తుంది. ఫలితంగా కొరియాలో ఒంటరిగా విమానం దిగవలసి వస్తుంది. భాష తెలియదు .. చేతిలో పెద్దగా డబ్బు లేదు. అలాంటి పరిస్థితులలో ఆమెకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని అధిగమించడానికి ఆమె ఏం చేస్తుంది? అనేది మిగతా కథ.
Latest News