|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 06:17 AM
ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం నాడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అశేష అభిమానుల సమక్షంలో ఈ టైటిల్ ప్రకటన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, "ప్రతి నటుడి జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే సినిమా, పాత్ర ఒకటి ఉంటుంది. నాకు 'వారణాసి' అలాంటిదే" అంటూ చేసిన భావోద్వేగ ప్రసంగం అందరి హృదయాలను హత్తుకుంది.శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈవెంట్‌లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన మహేశ్ బాబు, తన తండ్రి, దివంగత నటుడు కృష్ణ గారిని గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "నాన్నగారు ఎప్పుడూ నన్ను ఒక పౌరాణిక పాత్రలో చూడాలని కోరుకునేవారు. ఆ విషయంలో నేను ఆయన మాట వినలేదు. కానీ ఇప్పుడు నా మాటలు ఆయన పైనుంచి వింటూనే ఉంటారని నమ్ముతున్నాను. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి" అని చెబుతూ మహేశ్ గద్గద స్వరంతో మాట్లాడారు.ఈ చిత్రాన్ని తన కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణించిన మహేశ్, దీని కోసం ఎంతైనా కష్టపడతానని స్పష్టం చేశారు. "ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీని కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడతా. ముఖ్యంగా నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా నటిస్తాను. 'వారణాసి' సినిమా విడుదలైన తర్వాత యావత్ దేశం గర్వపడుతుంది" అని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. చాలా రోజుల తర్వాత అభిమానులను ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉందని, వారి ప్రేమకు, ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం టైటిల్ మాత్రమే ప్రకటించామని, మిగతా విషయాలు ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నామని అన్నారు.
Latest News