|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:56 PM
ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు గతంలో రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. అలానే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతోనూ సత్కరించింది. మోహన్ బాబు గతంలో తీసిన కొన్ని సినిమాలు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు ఉన్నాయి. ఆయన తాజాగా నిర్మించిన భక్తిరస ప్రధాన చిత్రం 'కన్నప్ప' సైతం సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంది. హైదరాబాద్ లో ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి రికమెండ్ చేయడంతో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఈ సినిమా చూడకుండా చేసిన విమర్శలే ఇందుకు కారణమని ఆయన భావించారు. గతంలో ఇదే నేపథ్యంలో వచ్చిన చిత్రాలతో పోల్చితే తమది క్లీన్ మూవీ అని అన్నారు. మొత్తానికీ ఆర్.సి. ఈ సినిమాకు కొన్ని కట్స్ తో క్లియరెన్స్ ఇచ్చింది. దక్షిణాది వారికి కన్నప్ప చరిత్ర తెలుసు కాబట్టి వారు అతని భక్తి తీవ్రతను అర్థం చేసుకుంటారని, కానీ ఉత్తరాది వారు అపార్థం చేసుకుంటారేమోనని సెన్సార్ వారు భయపడినట్టు తెలుస్తోంది. సెన్సార్ అడ్డంకులను అధిగమించి ఈ సినిమా ఎట్టకేలకు 27న జనం ముందుకు వస్తోంది.
Latest News