|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 04:03 PM
నితిన్, సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ్, శ్వాసిక, హరితేజ తదితరులు; సంగీతం: బి.అజనీష్ లోకనాథ్; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి; సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సమీర్‌రెడ్డి, సేతు; నిర్మాత: రాజు-శిరీష్; రచన, దర్శకత్వం: వేణు శ్రీరామ్; విడుదల: 04-07-2025 సుదీర్ఘ కెరీర్ ఉన్నా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న కథానాయకుల్లో నితిన్ ఒకరు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రమే 'తమ్ముడు'. 'వకీల్ సాబ్' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండటం, దిల్ రాజు నిర్మాత కావడం, లయ కీలక పాత్ర పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని 'తమ్ముడు' అందుకున్నాడా? నితిన్ ఖాతాలో హిట్ పడిందా? కథేంటంటే...జై (నితిన్) విలువిద్యలో దేశం తరఫున ఆడి ఎన్నో పతకాలు సాధిస్తాడు. మరొక పెద్ద లక్ష్యంపై గురి పెట్టినా, ఏకాగ్రత కుదరదు. మనసుని ఏవో జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. అక్క స్నేహలత (లయ)తో ముడిపడిన జ్ఞాపకాలే అవి అని కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది. జై చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలతో కుటుంబానికి దూరమవుతుంది స్నేహలత. ఇంకెప్పుడూ పుట్టింటి గడప తొక్కనని శపథం చేసి వెళ్లిపోతుంది. ఆ మాట ప్రకారమే తండ్రి చనిపోయినా, ఇంటికి తిరిగి చూడదు. అక్క విషయంలో చేసిన ఓ చిన్న తప్పు జైని వెంటాడుతూ ఉంటుంది. ఆ తప్పు గురించి చెప్పి, మళ్లీ అక్కకు దగ్గరవ్వాలని తన స్నేహితురాలు చిత్ర (వర్ష బొల్లమ్మ)తో కలిసి బయల్దేరతాడు. తీరా అక్కడకు వెళ్లాక ఆమె తన కుటుంబంతో కలిసి అంబర గొడుగు అటవీ ప్రాంతంలో జరిగే అమ్మవారి జాతరకు వెళ్లినట్టు తెలుస్తుంది. అలాగే తన పేరును ఝాన్సీగా పేరు మార్చుకున్నట్టు తెలుసుకుంటాడు. దీంతో తన సోదరిని కలిసేందుకు జై కూడా అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. మరోవైపు ఝాన్సీ, ఆమె కుటుంబాన్నీ అజర్వాల్ (సౌరభ్ సచ్‌దేవా) ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. మరి జై తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీని కలుసుకున్నాడా? అజర్వాల్ ముఠా నుంచి ఝాన్సీ, ఆమె కుటుంబం ఎలా బయట పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఎలా ఉందంటే... అక్కా తమ్ముడి కథతో ముడిపడిన ఓ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇది. అయితే ఆ బంధం చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు.. అడవిలో హీరో చేసే సాహసాలూ రెండూ మెప్పించలేదు. అసలు ఉందా లేదా అనిపించే కథ, దానికితోడు పేలవమైన కథనం, ఏమాత్రం ఆసక్తిని రేకెత్తించని యాక్షన్ సన్నివేశాలు వెరసి సినిమా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష. భోపాల్, వైజాగ్ తదితర ప్రదేశాల్లో గతంలో జరిగిన గ్యాస్ లీక్ సంఘటనల్ని గుర్తు చేస్తూ ఆసక్తికరంగానే సినిమాని మొదలుపెట్టాడు దర్శకుడు. ముఖ్యంగా విలన్ పరిచయ సన్నివేశాలు సినిమాలో మరింతగా లీనం చేస్తాయి. ఆ తర్వాత అక్కాతమ్ముళ్లు ఒకరికొకరు దూరమైన తీరు, కుటుంబ నేపథ్యంలోని ఆ సన్నివేశాలు భావోద్వేగాలపై అంచనాల్ని పెంచుతాయి. హీరో అడవి బాట పట్టేవరకూ సినిమా ట్రాక్‌లోనే వెళ్తుంది. ఆ తర్వాత నుంచే గాడి తప్పింది. అడవిలో పాత్రలు చేసే ఆర్తనాదాలు తప్ప, మరే ఇతర భావోద్వేగం ప్రేక్షకుడి హృదయాన్ని తాకవు. తొలి అరగంట తర్వాత సినిమా పూర్తిగా యాక్షన్ అడ్వెంచర్‌గా మలుపు తీసుకుంటుంది. ఝాన్సీకి, ఆమె కుటుంబానికీ రక్షణగా ఉంటూ, వాళ్లని అంబర గొడుగుని దాటించే బాధ్యత హీరోది. 'ఖైదీ' సినిమాని గుర్తుచేసే సందర్భం అది. అలాంటప్పుడు యాక్షన్ డిజైన్ థ్రిల్లింగ్‌గా ఉండాలి. హీరో చేసే సాహసాలు కట్టిపడేయాలి. కానీ, ఈ సినిమాలో అలాంటిదేమీ జరగదు. విజువల్స్‌తోనూ, సౌండ్‌తోనూ కట్టిపడేయాలనే ప్రయత్నం చేశారే కనిపించింది తప్ప, ఇతర యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలపై కానీ దృష్టిపెట్టలేదు. ద్వితీయార్ధంలోనూ కథ, సన్నివేశాలేమీ మారవు. ఈసారి మరింత ప్రమాదకరంగా కనిపించే బౌంటీ హంటర్స్‌ని రంగంలోకి దింపుతాడు విలన్. దాంతో నాలుగైదు గ్యాంగ్‌లు హీరో వెంటపడుతుంటాయి. చుట్టూ నిప్పుని రాజేసి, మధ్యలో హీరో ఉంటూ చేసే ఓ పోరాట ఘట్టం మినహా ఇతర యాక్షన్ సన్నివేశాలేవీ ప్రభావం చూపించవు. ప్రీ క్లైమాక్స్ మగధీర సినిమాలో వంద మంది యోధులతో సాగే పోరాటాన్ని గుర్తు చేస్తుంది. ఇలాంటి సినిమాల్లో సన్నివేశాలు ఆద్యంతం థ్రిల్‌ని పంచుతూ, పరుగులు పెట్టాలి. ఆ సీరియస్‌నెస్ కోసమని పాటలు, రొమాంటిక్ సన్నివేశాల జోలికి కూడా వెళ్లరు. ఈ సినిమా విషయంలోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ వేణు. కానీ ఆ అడవిలో హెల్ప్‌డెస్క్‌ని చూపిస్తూ, హీరోయిన్ సప్తమి గౌడ చుట్టూ మలిచిన సన్నివేశాలు కథా గమనాన్ని దెబ్బతీశాయి. కథానాయకుడి పాత్రని మరింత బలహీనంగా మార్చేశాయి. సినిమాలో ఆకట్టుకునే విషయం ఏదైనా ఉందంటే.. ప్రతినాయకుడి పాత్రని డిజైన్ చేసిన విధానమే. సౌండ్ డిజైన్, విజువల్స్ కూడా ఓ మోస్తరు ప్రభావం చూపిస్తాయి. ఎవరెలా చేశారంటే.. జై అనే ఆర్చరీ క్రీడాకారుడిగా కనిపిస్తాడు నితిన్. ఆయన కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడని సినిమా ఇది. యాక్షన్ ఘట్టాలు మినహా ఆయన ప్రత్యేకంగా చేయడానికంటూ ఇందులో ఏమీ లేదు. లుక్ కూడా మారలేదు. లయ ప్రాధాన్యమున్న పాత్రలోనే కనిపిస్తారు కానీ, అది సినిమాపై పెద్దగా ప్రభావం చూపించదు. ప్రతినాయకుడిగా నటించిన సౌరభ్ సచ్‌దేవా మెప్పిస్తాడు. వర్ష బొల్లమ్మ, శ్వాసిక విజయన్ పోరాట ఘట్టాలతోనూ ఆకట్టుకుంటారు. సప్తమిగౌడ చిన్న పాత్రలోనే కనిపిస్తారు. సాంకేతిక విభాగాల్లో సంగీతం, ఛాయాగ్రహణం పనితీరు మెప్పిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. దర్శకుడు శ్రీరామ్ వేణు రచనలోనే బలం లేదు. బలాలు + ప్రతినాయకుడి పాత్ర డిజైన్ + సాంకేతిక బృందం పనితీరు బలహీనతలు - కొరవడిన భావోద్వేగాలు - బలం లేని కథ, కథనాలు చివరిగా: అడవి పాలైన 'తమ్ముడు'..
Latest News