|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:21 PM
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మేకర్స్ ఈ విషయాన్ని తెలిపారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "చిరంజీవి, వెంకటేశ్ వంటి ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్‌లో డైరెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను" అని ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. "ఈ సినిమా ఫ్యాన్స్‌కు కచ్చితంగా ఒక పండగలా ఉంటుంది. 30 ఏళ్ల క్రితం చిరంజీవి గారు ఎలా డ్యాన్స్ చేశారో, మళ్లీ అదే ఎనర్జీ ఈ సినిమాలో చూపించారు" అని అన్నారు.
Latest News