|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 03:24 PM
‘కాంతార’ చిత్రంలోని దైవారాధన సన్నివేశాలను వేదికలపై అనుకరించడం తనను తీవ్రంగా కలచివేస్తోందని నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) ముగింపు వేడుకలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ‘కాంతార’లోని దైవం ఆవహించిన సన్నివేశాన్ని అనుకరించిన నేపథ్యంలో రిషబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.వివాదం పెరగడంతో రణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్షమాపణ చెప్పారు. "రిషబ్ అద్భుతమైన నటనను ప్రశంసించడమే నా ఉద్దేశం. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయంపై నాకు అపారమైన గౌరవం ఉంది. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించండి" అని ఆయన కోరారు.ఈ పరిణామాల తర్వాత రిషబ్ శెట్టి స్పందిస్తూ.. "సినిమాలో చాలా భాగం నటన కావచ్చు, కానీ దైవానికి సంబంధించిన అంశం మాకు చాలా పవిత్రమైనది, సున్నితమైనది. దానిని వేదికలపై ప్రదర్శించడం లేదా అపహాస్యం చేయడం వంటివి చేయవద్దని అందరినీ కోరుతున్నాను. అది మాతో భావోద్వేగ పరంగా ముడిపడి ఉంది" అని వివరించారు. ఈ ఆచారాల ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ‘కాంతార’లో ఎంతో శ్రద్ధ తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
Latest News