|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 03:08 PM
నానిహీరోగా నటించిన 'హిట్ 3' లో వర్ష పాత్రలో కనిపించి ప్రేక్షకులకు చేరువయ్యారు నటి కోమలి ప్రసాద్. ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన తన ఫొటోని ఉద్దేశించి తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను సినీ రంగంలోనే కొనసాగాలనుకుంటున్నానని చెప్పారు. ఆ ఫొటోని ఆధారంగా చేసుకొని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తెలుగింటికి చెందిన కోమలి ప్రసాద్ నటి మాత్రమే కాకుండా వైద్యురాలనే (డెంటిస్ట్) విషయం తెలిసిందే. ఇటీవల ఆమె డాక్టర్ కోట్ ధరించి ఓ దంత వైద్యశాలలో దిగిన ఫొటోని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. దీనిని చూసిన పలువురు ఆమె యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి పూర్తిస్థాయిలో డాక్టర్‌గా కొనసాగనున్నారని మాట్లాడుకున్నారు. ఈమేరకు ఆన్‌లైన్‌లో ప్రచారం జరిగింది. పలు వెబ్‌సైట్స్‌లోనూ కథనాలు ప్రచురితమయ్యాయి. నెట్టింట వైరల్‌గా మారిన ఈ ప్రచారంపై తాజాగా ఆమె స్పష్టతనిచ్చారు. జీవితాంతం తాను నటిగానే కొనసాగాలనుకుంటున్నానని చెప్పారు. ''యాప్రాన్ ధరించి ఉన్న ఇటీవల నేను షేర్ చేసిన ఓ ఫొటో అనవసరమైన చర్చకు దారితీసింది. నటనను వదిలేసి నేను వైద్యురాలిగా వృత్తి బాధ్యతలు నిర్వహించనున్నానని ప్రచారం జరిగింది. ఈమేరకు కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదు. ఎంతోకాలం శ్రమించిన తర్వాత పరమేశ్వరుడి దయతో నటిగా నా ప్రయాణం ఈ స్థితికి చేరుకుంది. నన్ను, నా శ్రేయోభిలాషులను ఇబ్బందిపెట్టేలా అనవసరమైన ప్రచారాన్ని ఇప్పుడు నేను కోరుకోవడం లేదు. విధిని నేను నమ్ముతా. దానివల్లే నేను ఈ రంగం వైపు అడుగులు వేశా. చివరివరకూ ఇదే రంగంలో కొనసాగాలని.. ఉన్నతంగా వర్క్ చేయాలని అనుకుంటున్నా. నాపై నమ్మకం ఉంచిన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. స్క్రిప్ట్‌ల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా. మీ అందరూ గర్వపడేలా సినిమాలు చేస్తా. త్వరలోనే కొత్త సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్‌తో మీ ముందుకువస్తా'' అని ఆమె పేర్కొన్నారు. 'నేను సీతాదేవి', 'నెపోలియన్', 'రౌడీ బాయ్స్', 'శశివదనే', 'హిట్ 2, 3' చిత్రాల్లో నటించారు కోమలి ప్రసాద్.
Latest News