|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:35 PM
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పరమ శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించగా, మోహన్ బాబు, ప్రభాస్, శరత్‌కుమార్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే అమెరికా, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోప్రత్యేక ఈవెంట్లు సైతం నిర్వహించి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.ఇదిలాఉంటే.. ఈ సినిమా ప్రారంభంలోనే అప్పటివరకు కథానాయికగా ఉన్న నుపుర్ సనన్ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్ ను ఆ స్థానంలోకి వచ్చి చేరడం సినిమా పూర్తి చేయడం చకచకా జరిగిపోయాయి. ఆపై ఈ ముద్దుగుమ్మపై చిత్రీకరించిన పాటలు, సన్నివేశాలను కాలక్రమంలో మేకర్స్ రిలీజ్ చేస్తూ సినిమా జనాల నోళ్లల్లో నానేలా చేశారు. అయితే ఈ సినిమా విడుదల నేపథ్యంలో సినిమా టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతుండగా వాటిళ్లో ఎక్కడా ఈ ముద్దుగుమ్మ కనిపించక పోవడంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కేరళలో జరిగిన ప్రొగ్రాంలో మోహన్ లాల్, కన్నడ నాట శివ రాజ్‌కుమార్ వంటి మహా నటులు ఈ మూవీ ఈవెంట్‌లలో పాల్గొనగా హీరోయిన్ అక్కడా కూడా దర్శనమివ్వలేదు. అప్పుడెప్పుడో ఏడాది క్రితం సినిమా టీజర్ ఈవెంట్‌లో కనిపించిన ఈ చిన్నది మళ్లీ ఈ చిత్రం విషయమై ఇప్పటివరకు కనిపించింది లేదు.అఖరుకు.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మెయిన్ ఈవెంట్‌లోనూ ప్రీతి కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాశం అవుతుంది. కన్నప్ప సినిమాలో తిన్నడు ప్రేయసిగా, భార్యగా కీలక పాత్ర పోషించిన నటి ఈవెంట్లలో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది. అంతేకాదు ఇప్పటికే సినిమాలో విష్ణు, ప్రీతి ముకుందన్‌లపై చిత్రీకరించిన పాట బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు అందులో హీరోయిన్‌కు వేసిన బట్టలు, పాట చిత్రీకరించిన విధానం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సినిమాలో ఇంత రొమాంటిక్ సాంగ్ ఏంటనే కామెంట్లు వచ్చాయి. ఇది అసలు భక్తి చిత్రమా లేక రక్తి మూవీనా అనే వరకు వెళ్లింది. కాగా ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియోలోనూ ప్రధానంగా హీరోయిన్ ప్రీతి నటించిన యుద్దం, ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలే అధికంగా చూపించడం విశేషం.అలాంటిది పాన్ ఇండియాగా విడుదలవుతున్న ఇంత పెద్ద సినిమాలో కీ రోల్ చేసిన నటి ఇ్పపుడు ఎక్కడా కనిపించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు చిన్న క్యారెక్టర్ చేసిన సీనియర్ నటి మధుబాల రాగా హీరోయిన్ ఎందుకు రాలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూవీ యూనిట్ ప్రీతిని లెక్కలోకి తీసుకోలేదా, ఈవెంట్లకు పిలవడం మరిచారా, కావాలనే దూరం పెట్టారా లేక తనే రానందా అనే ప్రశ్నలు చిత్ర బృందానికి ఎదురౌతున్నాయి.
Latest News