|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 07:02 PM
ప్రముఖ తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి మధ్య కొంతకాలంగా నడుస్తున్న విడాకుల వివాదం ముదురుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉండగా, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా, తనపై ఆర్తి చేసిన ఆరోపణలను ఖండిస్తూ, ఆమె తనను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించిందని ఆరోపిస్తూ జయం రవి గురువారం ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.గతంలో జయం రవి తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల గాయని కెనిషాతో జయం రవి ఓ వివాహ వేడుకలో కనిపించారన్న వార్తల నేపథ్యంలో, ఆర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో జయం రవిపై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, జయం రవి తన పిల్లలను పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.ఈ ఆరోపణలపై జయం రవి తీవ్రంగా స్పందించారు. గురువారం విడుదల చేసిన నాలుగు పేజీల లేఖలో ఆర్తి చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. కెనీషా ఎంతో మంచి వ్యక్తి అని, ఆమెకు గౌరవ, మర్యాదలు దక్కాలని అన్నారు. అలాగే, ఆర్తితో తన వైవాహిక జీవితం ఓ బందీఖానాలా ఉండేదని, ఇప్పుడు విడిపోవడంతో స్వేచ్ఛ లభించినట్లు భావిస్తున్నానని రవి తెలిపారు."శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, చివరికి ఆర్థికంగా కూడా ఆర్తి నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ విషయాలు చెప్పడానికి బాధగా ఉన్నా, వాస్తవాలు ఇవే. కనీసం నా సొంత తల్లిదండ్రులను కూడా కలుసుకునే అవకాశం లేకుండా చేసింది" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా, ఆర్తి తన పిల్లలను ఆయుధాలుగా వాడుకుంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని జయం రవి ఆరోపించారు. "నాపై లేనిపోని అపవాదులు వేస్తే చూస్తూ ఊరుకోను. న్యాయ ప్రక్రియపై నాకు పూర్తి విశ్వాసం ఉంది" అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి సంబంధంలో కొనసాగడం కంటే బయటకు రావడమే మేలని నిర్ణయించుకున్నట్లు రవి వివరించారు. తాను ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే 'మాజీ' అనే పదం మనసులో ముద్రించుకుపోయిందని, అది జీవితాంతం అలాగే ఉండిపోతుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది.
Latest News