|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:52 PM
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ వేదికలపై అడుగుపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన 'కుబేర' చిత్ర విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, నాగార్జునను ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. మంచి పాత్ర లభిస్తే ఓటీటీలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... "నాగార్జున నాకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిస్తూ ఉంటారు. ఆయన ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆలోచనా విధానం, స్థితప్రజ్ఞత వంటి అనేక లక్షణాలు నన్ను ఆకట్టుకుంటాయి. ఎలాంటి పరిస్థితినైనా ఆయన ఎంతో ప్రశాంతంగా ఎదుర్కొంటారు" అని అన్నారు. ఓటీటీ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ... "భవిష్యత్తులో అవసరం వస్తే ఓటీటీలో సినిమాలు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి ఇప్పటినుంచే మానసికంగా సిద్ధపడాలి. ఈ విషయంలో కూడా నాగార్జున తీసుకున్న నిర్ణయమే నాకు ప్రేరణ కలిగించింది" అని చిరంజీవి వివరించారు. అయితే, ఓకే అన్నాను కదా అని రేపు ఉదయమే కథలతో నా ముందుకు రావద్దు అంటూ చిరు సరదాగా వ్యాఖ్యానించారు.చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్‌గా మారాయి. త్వరలోనే ఆయన్ను ఓటీటీ తెరపై కూడా చూడవచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నటులు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటుండగా, విక్టరీ వెంకటేశ్ 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించారు.
Latest News