|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 08:21 PM
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'థగ్ లైఫ్' ప్రదర్శన విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ సినిమా ప్రదర్శనలకు పూర్తి రక్షణ కల్పిస్తామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ప్రభుత్వ హామీతో, సినిమాపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు ముగించింది.కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' సినిమా ప్రదర్శనలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తమ వైఖరిని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సినిమా స్క్రీనింగ్‌లకు అవసరమైన భద్రతను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ హామీతో సంతృప్తి చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సినిమాపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తరచూ కొందరు వ్యక్తులు లేదా సంఘాలు తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆందోళనలు చేపట్టడం వల్ల కళాసృష్టికి ఆటంకం కలుగుతోందని అభిప్రాయపడింది. "ఇలాంటి వాటిని ఇక ఏమాత్రం కొనసాగనివ్వలేం. కేవలం ఒకరి అభిప్రాయం కారణంగా ఒక చిత్రాన్ని ఆపేయాలా? స్టాండప్ కామెడీ ప్రదర్శనలను నిలిపివేయాలా?" అని బెంచ్ ప్రశ్నించింది. కళాకారుల సృజనాత్మకతకు ఇలాంటి అడ్డంకులు తగవని స్పష్టం చేసింది.
Latest News