![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:54 AM
తెలుగమ్మాయి రీతూ వర్మ తమిళ చిత్రాలలోనూ నటించి చక్కని గుర్తింపు తెచ్చుకుంటోంది. రొటీన్ కు కాస్తంత భిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. అలాంటి రీతూ వర్మ నటించిన తొలి వెబ్ సీరిస్ 'దేవిక అండ్ డానీ'. దీన్ని 'శ్రీకారం' ఫేమ్ బి. కిశోర్ డైరెక్షన్ లో సుధాకర్ చాగంటి ప్రొడ్యూస్ చేశారు. ఈ వెబ్ సీరిస్ ఇప్పుడు జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఇక కథ విషయానికి వస్తే .... దేవికా నందన్ (రీతూ వర్మ) ఆంధ్రప్రదేశ్ లోని ఓ పల్లెటూరిలోని స్కూల్ లో మ్యూజిక్ టీచర్ గా పని చేస్తుంటుంది. ఆమెకు జగన్నాథం ఉరఫ్ జగ్గీ సుబ్బరాజు తో వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. మూడు నెలల్లో పెళ్ళి అనగా తన జీవితంలో ఎలాంటి మ్యాజిక్ జరగడం లేదని, బావిలో కప్పలా జీవితాన్ని గడిపేస్తున్నానని ఆమె లోలోపల బాధపడుతూ ఉంటుంది. పెళ్ళి సందర్భంగా దేవిక జాతకం చూసిన ఓ పెద్దాయన త్వరలోనే ఆమె ఓ కొత్త బంధంలోకి ప్రవేశిస్తుందని చెబుతాడు. అలా ఆమె జీవితంలోకి ఊహించని విధంగా డానీ సూర్య వశిష్ఠ వస్తాడు. దేవికతో పరిచయం పెంచుకుని, ఆమె తాతయ్య యోగి నందన్ (రామరాజు) తో సాయం పొందాలని డానీ భావిస్తాడు. కానీ అందుకు దేవిక నిరాకరిస్తుంది. విషయం ఏమిటంటే... డానీ భౌతికంగా ఉన్న మనిషి కాదు ఓ ఆత్మ. దేవిక తాతయ్య ఆత్మలతో సంభాషించి, వారి కష్టాలను తీర్చే సామర్థ్యం ఉన్న వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పని చేయడం మానేస్తాడు. కాబట్టి తన తాతయ్యతో డానీ విషయాన్ని చెప్పలేనని దేవిక స్పష్టం చేస్తుంది. బట్... డానీ హత్యకు కారణం తెలిసిన తర్వాత దేవిక మనసు మార్చుకుంటుంది. బావిలో కప్పలా పెరిగిన ఆమె చొరవ చూపించి రంగంలోకి దిగుతుంది. డానీ తాను చేయాలనుకున్న ఏ పనిని అయితే పూర్తి చేయకుండా మధ్యలో ఆపేశాడో దానిని కంప్లీట్ చేయడానికి సిద్ధపడి, సుబ్బు శివ కందుకూరి సాయంతో దాన్ని పూర్తి చేస్తుంది.ఓ పల్లెటూరి అమ్మాయి... తాను ఇష్టపడే వ్యక్తి కోసం ప్రాణాలకు సైతం తెగించి ఎలా పోరాడింది, చివరకు అందులో ఎలా విజయం సాధించింది? అనేదే 'దేవిక అండ్ డానీ' వెబ్ సీరిస్ లోని ప్రధానాంశం. ఈ మొదటి సీజన్ లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. దాదాపు మూడున్నర గంటల నిడివితో ఇది సాగింది. అయితే... కథలో కానీ కథనంలోనే గానీ మనకు కొత్తదనం కనిపించదు. సిటీ మధ్యలోని స్థలంపై కబ్జాదారులు కన్నువేయడం, దాన్ని ఆక్రమించడం కోసం ఎంతకైనా తెగించడం, వాళ్ళ ప్రయత్నాన్ని హీరో అడ్డుకోవడం, చివరకు బాధితులకు న్యాయం చేకూర్చడం... ఇలాంటి సంఘటనలు ఎన్నో సినిమాల్లో చూశాం. ఇక నిస్సహాయతతో కూడిన ఆత్మలు తమ సమస్యలను ఏకరువు పెట్టి హీరోల ద్వారా వాటిని పరిష్కరించుకునే సినిమాలూ చాలానే వచ్చాయి. అయితే... ఇందులో ఆ పనిని హీరోయిన్ చేస్తుంది. అంతే తేడా!
Latest News