|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 06:24 PM
తెలుగు తెరపై సందడి చేసిన కమెడియన్స్ లో 'ఐరన్ లెగ్ శాస్త్రి' ఒకరు. తెరపై హాస్యభరితమైన పురోహితుడి పాత్ర చేయాలంటే ముందుగా ఆయననే సంప్రదించేవారు. అప్పట్లో ఆయన లేని సినిమా దాదాపుగా ఉండేది కాదు. అలాంటి ఆయన చివరి రోజులలో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతూ చనిపోయారు. ఆయన తనయుడు ప్రసాద్, తాజాగా అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మా నాన్న దాదాపు 500 సినిమాలలో నటించారు .. 100 సీరియల్స్ వరకూ చేశారు. అయినా ఆయన సంపాదించింది ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు .. కొంతమంది భోజనం పెట్టి పంపించేవారు. బ్రాహ్మణుడు కావడం వలన ఆయనకి ఆత్మాభిమానం ఎక్కువ. అందువలన ఎవరినీ ఏమీ అడిగేవారు కాదు. అలాంటి ఆయనను కొంతమంది తప్పుదారి పట్టించారు. మందుపార్టీలు .. సిట్టింగ్స్ లో ఉంటేనే ఛాన్సులు వస్తాయని చెప్పి, తాగుడు అలవాటు చేశారు" అని అన్నాడు. " నానా తాగుడికి అలవాటైన తరువాత ఉన్న ఛాన్సులు కూడా పోయాయి. మళ్లీ పౌరోహిత్యం వైపు రాలేని పరిస్థితి. ఆయన నాకు ఇచ్చింది ఏమీ లేదు. ఆయన చనిపోయినప్పుడు కార్యక్రమాల కోసం అవసరమైన డబ్బు కూడా బంధువులే ఏర్పాటు చేశారు. ఐరన్ లెగ్ శాస్త్రి తనయుడిగా నన్ను ఎవరూ గౌరవించలేదు .. అవకాశాలు ఇచ్చింది లేదు .. పైగా అవమానించారు. అందువల్లనే నేను చదువుపై దృష్టి పెట్టాను. ఎంబీఏ .. సీఏ పూర్తి చేసి మంచి పొజీషన్ లో ఉన్నాను" అని చెప్పాడు.
Latest News