|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:41 PM
నేచురల్ స్టార్ నాని ఇంతవరకూ 32 సినిమాలు చేశాడు. అతని 33వ సినిమా 'ది ప్యారడైజ్' ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. 2008లో 'అష్టాచమ్మా'తో మొదలైన నాని కెరీర్ అప్రతిహతంగా సాగిపోతోంది. తాజాగా 'హిట్ 3'తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. విశేషం ఏమంటే... కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి చేసిన సినిమాలూ ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు తాను నిర్మాతగా తీసిన 'హిట్'కు, ఇటీవల నిర్మించిన 'కోర్ట్' కు కూడా కొత్త దర్శకుడికే నాని అవకాశం ఇచ్చాడు. అయితే... ఈ పదిహేడేళ్ళ కాలంలో నాని కేవలం నలుగురు దర్శకులతోనే రిపీట్ మూవీస్ చేశాడు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఐదో దర్శకుడు రాబోతున్నాడు. నాని... తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణతో మూడు సినిమాలు చేశాడు. 'అష్టాచమ్మా' తర్వాత 'జెంటిల్ మన్' ఆ తర్వాత 'వి' చిత్రాలలో నటించాడు. అలానే తన సినిమా 'నిన్ను కోరి'తో దర్శకుడిగా పరిచయం అయిన శివ నిర్వాణతో నాని ఆ తర్వాత 'టచ్ జగదీశ్' మూవీని చేశాడు. అలానే దర్శకుడు వివేక్ ఆత్రేయతో 'అంటే సుందరానికీ...', 'సరిపోదా శనివారం' చిత్రాలకు వర్క్ చేశాడు. ఇక తన సినిమా 'దసరా'తో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెలతో నానికి స్పెషల్ రిలేషన్ షిప్. 'దసరా' మూవీ తర్వాత నాని... శ్రీకాంత్ ఓదెలతో 'ది ప్యారడైజ్' అనే మూవీ చేస్తున్నాడు. అంతేకాదు... చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమాను నిర్మించే పనిలోనూ నాని ఉన్నాడు. అయితే ఇప్పుడీ నలుగురు దర్శకులు కాకుండా నాని ఐదో దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్నాడు. అతనే శౌర్యువ్. నాని హీరోగా 'హాయ్ నాన్న' మూవీని తెరకెక్కించాడు శౌర్యువ్. ఆ సినిమా కమర్షియల్ గా గ్రాండ్ సక్సెస్ ను ఇవ్వకపోయినా... నానికి నటుడిగా మరోసారి మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమా కూడా డీసెంట్ కలెక్షన్స్ ను వసూలు చేసింది. అందుకే శౌర్యువ్ తోనే మరో సినిమా చేయాలని నాని, 'హాయ్ నాన్న' నిర్మాతలు భావించినట్టు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే రొమాంటిక్ కామెడీ మూవీ అనే టాక్ ఆ మధ్యలో వినిపించింది కానీ ఇది పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే యాక్షన మూవీ అని తాజా సమాచారం.
Latest News