|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 04:03 PM
తాను కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమేనన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. తాజాగా జరిగిన 'కుబేర' సక్సెస్ మీట్‌లో తన స్పీచ్‌తో అందరినీ ఉత్సాహపరిచిన ఆయన నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. నాగ్ తనకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తిన్నిస్తుంటారని చెప్పారు. ''నాగార్జున ఎన్నో విషయాల్లో నాలో స్ఫూర్తినింపుతుంటారు. ఆరోగ్యం, నడవడిక, ఆలోచనలు, స్థితప్రజ్ఞత.. ఇలా ఎన్నో విషయాలు ఆయనలో నాకు నచ్చుతాయి. ఏం జరిగినా ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. నేను కూడా భవిష్యత్తులో ఏమైనా అవసరం వచ్చి ఓటీటీలో సినిమాలు చేయాల్సి వచ్చినా రెడీ.. దానికి ఇప్పటినుంచే మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలోనూ నాగార్జున తీసుకున్న నిర్ణయం నాకు స్ఫూర్తి. ఓకే అన్నాను కదా అని రేపు ఉదయాన్నే స్క్రిప్ట్‌లు తీసుకొని వచ్చేయకండి'' అంటూ సరదాగా చెప్పారు చిరంజీవి. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. త్వరలోనే ఆయన్ను ఓటీటీలో కూడా చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోలంతా ఏదోరకంగా ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. పలు కార్యక్రమాలకు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నారు. వెంకటేశ్ 'రానా నాయుడు'తో అలరించారు. ఇక చిరు కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారని గతేడాది వార్తలు వచ్చాయి. ఓటీటీలో తెరకెక్కే ప్రాజెక్ట్‌లకు కథే బలం. అందుకే బలమైన కథ కోసం వెతుకుతున్నారని.. కొంతమంది రచయితలకు చిరంజీవి తన వయసుకు తగిన బలమైన కథ రాయాలని సూచించినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఓటీటీ కామెంట్స్‌పై మరోసారి ఈ విషయం తెర పైకి వచ్చింది.
Latest News