|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 12:29 PM
వెబ్ సిరీస్ లలో పాపులరై, సినిమాల్లో సహాయక పాత్రలతో మెప్పిస్తూ యువనటుడు అభిషేక్ బెనర్జీ గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు. తొలుత మంచి కామెడీ టైమింగ్ ఉన్న హాస్య నటుడిగా అందరి హృదయాలను గెలుచుకున్న అతడు, ఇప్పుడు `స్టోలెన్` అనే సినిమా లో ప్రదర్శించిన ఎమోషనల్ పెర్ఫామెన్స్ అందరినీ టచ్ చేసింది. ఒక కమెడియన్ గా చూసిన బెనర్జీని ఎమోషనల్ పాత్రలో చూడగలగడం గొప్ప విషయమే. అతడు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల ప్రతిభావంతుడు అని నిరూపణ అయింది. అయితే టాలీవుడ్ లో అల్లరి నరేష్ లాంటి నటుడు కామెడీ పాత్రల నుంచి మారి, సీరియస్ ఎమోషనల్ పాత్రల్లో నటించినప్పుడు తెలుగు ప్రజలు ఎందుకు అతడిని రిసీవ్ చేసుకోలేదు. `నేను` అనే చిత్రంలో అల్లరి నరేష్ నటుడిగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాంది అనే సీరియస్ డ్రామాలోను నరేష్ అద్బుతంగా నటించాడు. జైలు నేపథ్యంలోని ఈ సినిమాలో అతడి నటప్రదర్శనకు గొప్ప పేరొచ్చింది. కానీ అవి బాక్సాఫీస్ విజయాలుగా మారలేదు. నరేష్ ఆ తర్వాత అలాంటి జానర్ సినిమాలలో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. అయితే దీనికి కారణం.. అతడు కేవలం ఒక స్థానిక భాషకు పరిమితమవ్వడమే. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో నరేష్ లాంటి నటుడు జాతీయ స్థాయిలో ఎందుకు నిరూపించకూడదు. చాలా మంది అనామకులు తెలుగు ప్రజల్లోకి కూడా దూసుకొస్తుంటే, నరేష్ ఎందుకు ప్రయత్నించడం లేదు? జాతీయ స్థాయిలో పాపులరయ్యే వెబ్ సిరీస్ లలో అతడు అవకాశాలు వెతుక్కుంటే అది అతడి కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందేమో! అభిషేక్ బెనర్జీకి పాతాళ్ లోక్ , మీర్జా పూర్ లాంటి వెబ్ సిరీస్ లు గొప్ప పేరు తెచ్చాయి. అతడు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో డిజిటల్ వరల్డ్ లో ఎత్తుగడలు నటీనటులకు చాలా కీలకంగా మారాయి. నరేష్ లాంటి నటులు దీనిని గమనించారో లేదో..!
Latest News