|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 05:13 PM
ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న విమర్శలు, ట్రోల్స్ గురించి తాజాగా మనసు విప్పారు. తనను ద్వేషించిన వారికి సైతం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మలయాళంలో తాను నటిస్తున్న ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్ర ప్రచారంలో భాగంగా ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ థ్రిల్లర్ చిత్రంలో సురేశ్ గోపి కీలకపాత్ర పోషిస్తున్నారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంతో మలయాళ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటానని అనుపమ ధీమా వ్యక్తం చేశారు.తెలుగులో 'ప్రేమమ్', 'అ ఆ', 'శతమానం భవతి' వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైనప్పటికీ, కెరీర్ తొలినాళ్లలో తనకు నటన రాదంటూ పలువురు తీవ్రంగా ట్రోల్ చేశారని అనుపమ గుర్తుచేసుకున్నారు. ఆ మాటలు మొదట్లో బాధపెట్టినా, అవే తనలో పట్టుదల పెంచాయని, నటిగా తనను తాను నిరూపించుకోవాలనే కసిని రగిలించాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు.అయితే, ఈ విమర్శలే తనను తాను మెరుగుపరుచుకోవడానికి, మంచి కథలను ఎంచుకోవడంలో మరింత జాగ్రత్త వహించడానికి దోహదపడ్డాయని అనుపమ వివరించారు. విమర్శల ఫలితంగా తన ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చిందని, ప్రేక్షకులను మెప్పించే బలమైన కథలను మాత్రమే ఎంచుకోవాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ తనపై నమ్మకముంచి ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (జేవీఎస్‌కే) వంటి అద్భుతమైన చిత్రంలో అవకాశం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా, తనకు మద్దతుగా నిలిచినవారితో పాటు, తనను ద్వేషించిన వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, వారి విమర్శలే తనను మరింత దృఢంగా తీర్చిదిద్దాయని అనుపమ వ్యాఖ్యానించారు.
Latest News