|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 09:36 PM
నందమూరి బాలకృష్ణ ఇచ్చిన సలహాలు, సూచనలతోనే ‘అఖండ 2’ సినిమా విడుదల సమస్యలను అధిగమించగలిగామని దర్శకుడు బోయపాటి శ్రీను స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చివరి నిమిషంలో సినిమా వాయిదా పడినప్పుడు బాలకృష్ణ తమకు అండగా నిలిచారని తెలిపారు.బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2’ ఇటీవల డిసెంబరు 12న విడుదలైంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబరు 5నే విడుదల కావాల్సి ఉండగా, నిర్మాతలకు ఎదురైన ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బోయపాటి ఈ అంశంపై మాట్లాడారు.విడుదల వాయిదా పడినప్పుడు తాను టెన్షన్ పడలేదని, కానీ బాలయ్య అభిమానుల గురించి మాత్రం చాలా భయపడ్డానని బోయపాటి అన్నారు. షోకు రెండు మూడు గంటల ముందు రద్దు చేస్తే అభిమానుల కోపాన్ని నియంత్రించడం కష్టం. అడ్వాన్స్ టికెట్లు కొన్నవారి ఆవేదనను మేము అర్థం చేసుకున్నాం. అందుకే ముందుగా థియేటర్ల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా చూశాం. ఆ తర్వాత బాలకృష్ణ గారితో చర్చించి, ఆయన సలహాలు పాటిస్తూ సినిమాను విడుదల చేశాం అని వివరించారు.ఈ సినిమాకు శివుడి సెంటిమెంట్ ఏమైనా అడ్డువచ్చిందా అని విలేకరులు అడగ్గా, ఇది శివుడి సినిమా కాదని, శివ భక్తుడి కథ అని బోయపాటి బదులిచ్చారు. డబ్బు కోసం ఈ సినిమా తీయలేదని, ఇది సందేశాత్మక చిత్రం కూడా కాదని, కేవలం కమర్షియల్ హంగులతో వినోదాన్ని పంచే చిత్రమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘అఖండ 2’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
Latest News