|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 05:22 PM
న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న తన్వి ఝాన్సీ రాజ్‌గరియా అనే భారతీయ కంటెంట్ క్రియేటర్ తనకు ఎదురైన భయానక అనుభవాల కారణంగా అమెరికాను వీడి భారత్‌కు తిరిగి వచ్చేశారు. పెరుగుతున్న ద్వేషం, జాత్యహంకారం, భద్రతపై నిరంతర భయంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు.అమెరికా రాజకీయాలపై వలసదారురాలిగా తాను కామెడీ కంటెంట్ చేసేదాన్నని, దానికి మంచి ఆదరణ లభించినప్పటికీ, అదే స్థాయిలో ద్వేషం కూడా పెరిగిందని తన్వి తెలిపారు. "నా కంటెంట్‌కు ఆదరణ పెరిగేకొద్దీ ద్వేషం కూడా పెరిగింది. నన్ను ఐస్ (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అధికారులకు పట్టిస్తామని బెదిరించారు. నా వీడియోల కింద ‘డీపోర్ట్’ (దేశం నుంచి పంపించేయండి) అని కామెంట్లు పెట్టేవారు. భౌతిక దాడులకు పాల్పడతామని హెచ్చరించారు" అని తన్వి వాపోయారు.తాను ఆర్టిస్ట్ వీసాపై చట్టబద్ధంగానే అమెరికాలో ఉన్నప్పటికీ, తన రూపం (4’11 అడుగుల ఎత్తు, బ్రౌన్ స్కిన్, వలస మహిళ) కారణంగా లక్ష్యంగా మారానని ఆమె చెప్పారు. "రాత్రిపూట తలుపు చప్పుడు వినబడితే ఐస్ అధికారులు వచ్చారేమోనని భయపడేదాన్ని. ఏ పోలీస్ అధికారి కనిపించినా నా గుండె వేగంగా కొట్టుకునేది. కేవలం నేను ఉన్నానన్న కారణంతోనే నన్ను ఒక నేరస్తురాలిగా చూసే పరిస్థితిని భరించలేకపోయాను" అని తన భయానక పరిస్థితిని వివరించారు. ఒక వ్యక్తి తన వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టేందుకు ప్రయత్నించడంతో (డాక్సింగ్) ఇక అమెరికాలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
Latest News