|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 05:05 PM
దాదాపు హీరోగా వంద చిత్రాలు పూర్తి చేశానని, ఇకపై ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ నటుడు రాజశేఖర్ తెలిపారు. తాజాగా రాజశేఖర్ తన కెరీర్, ఆరోగ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఖాళీగా ఉండటం అస్సలు నచ్చదని, పని లేకపోతే జైలులో ఉన్నట్లుగా అనిపిస్తుందని అన్నారు. శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా ఆయన తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "గతంలో ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడి ఫొటోగ్రాఫర్ ఒకరు 'మీ చేతి నిండా పని ఉంది, మీరు చాలా లక్కీ' అన్నారు. ఆ రోజు ఆ మాటకు విలువ పెద్దగా అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు దాని ప్రాముఖ్యత అర్థమవుతోంది. కరోనా సమయంలో నేను నడవలేని పరిస్థితికి వెళ్లాను. రెండు, మూడు నెలల్లో కోలుకున్నా, పని చేయాలనే తపన మాత్రం తగ్గలేదు," అని వివరించారు."చాలా కథలు విన్నాను, కానీ ఏవీ నచ్చలేదు. ఆ నిరాశలో ఉన్నప్పుడు దర్శకుడు అభిలాష్ ‘బైకర్’ కథతో నా దగ్గరకు వచ్చారు. ఈ స్క్రిప్ట్ నాకు ఎంతగానో నచ్చింది. ఓ నటుడిగా ప్రతిరోజూ సెట్ నుంచి ఎంతో సంతృప్తితో ఇంటికి వెళ్లేవాడిని," అని పేర్కొన్నారు. ఈ సినిమా గ్లింప్స్ ముందే చూసి ఉంటే, తానే హీరో పాత్రను అడిగేవాడినంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
Latest News