![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 09:30 AM
ప్రముఖ సినీ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష లేదా సంస్కృతి గౌరవానికి భంగం కలిగించేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయన్ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.గత నెలలో తన ‘థగ్ లైఫ్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పలు కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో వివాదం మరింత ముదిరి, కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదల కూడా నిలిచిపోయింది.ఈ నేపథ్యంలో కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్ వూరాలా.. కమల్ వ్యాఖ్యలపై బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి ఎన్.ఆర్. మధు.. కన్నడ భాష, సాహిత్యం, భూమి, సంస్కృతికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా కమల్‌పై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంతేగాక ఆగస్టు 30న జరగనున్న తదుపరి విచారణకు కమల్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు కూడా జారీ చేశారు.
Latest News