|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 07:23 PM
నటుడు శింబు తన తదుపరి చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల కార్యక్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన సినీ ప్రయాణంలో ఎదురైన కష్టనష్టాలను, వివాదాలను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో వేడుక శనివారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ క్లిష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిన వారిని తలచుకున్నారు."నా ఇన్నేళ్ల సినిమా జీవితంలో ఎన్నో సవాళ్లను చూశాను. ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ప్రతి కష్ట సమయంలో నా తల్లిదండ్రులు అండగా నిలబడి, ధైర్యం చెప్పారు" అంటూ శింబు తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. తనకు నటుడిగా స్ఫూర్తినిచ్చిన వ్యక్తి కమల్ హాసన్ అని, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలే తనకు మార్గదర్శకమని తెలిపాడు. "కమల్ హాసన్ సినిమాలు చూస్తూ పెరిగాను. నటుడిగా నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నాలాంటి ఎంతోమందికి ఆయనే స్ఫూర్తి. ఒకానొక దశలో నేను వరుస సినిమాలు చేస్తున్నప్పుడు, కమల్ హాసన్‌ను రీప్లేస్ చేసే నటుడు వచ్చాడని చాలామంది అన్నారు. నిజం చెప్పాలంటే ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నా దృష్టిలో ఆయనొక గొప్ప మార్గదర్శి" అంటూ శింబు కన్నీటి పర్యంతమయ్యారు.‘బీప్ సాంగ్’ వివాదం, ‘రెడ్ కార్డ్’ జారీ వంటి క్లిష్ట పరిస్థితుల గురించి కూడా శింబు ప్రస్తావించాడు. "సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఇప్పటికీ పెడుతూనే ఉన్నా. నా ‘బీప్ సాంగ్’ విడుదలైనప్పుడు పెద్ద వివాదం చెలరేగింది. అది నా జీవితంలో చాలా కష్టమైన దశ. ఆ సమయంలో ఆయన తన పనులన్నీ పక్కనపెట్టి నా సినిమా కోసం పనిచేశారు. నాకు ఎంతగానో అండగా నిలిచారు. గాయకుడిగా నాకు తొలి అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. ఇప్పటివరకు నేను వివిధ భాషల్లో 150 పాటలు పాడానంటే దానికి కారణం ఆయనే" అని రెహమాన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
Latest News