|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 06:11 PM
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్... మణిరత్నం దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న 'థగ్ లైఫ్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేదికపైనే కమల్ హాసన్, ఆ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ నటుడు జోజూ జార్జ్ నటన గురించి మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ ప్రశంసలకు జోజూ భావోద్వేగానికి గురయ్యారు.'థగ్ లైఫ్' ఆడియో విడుదల వేడుకలో కమల్ హాసన్ మాట్లాడుతూ, "నటీనటులు ఎవరైనా ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే, వారిని నేను పోటీగా భావిస్తాను. కానీ, జోజూ జార్జ్ విషయంలో మాత్రం నాకు అసూయ కలుగుతుంది. ఆయన అంత అద్భుతంగా నటిస్తారు. ఏదేమైనా, నటీనటులను స్వాగతించాల్సిన బాధ్యత నాపై ఉంది" అని అన్నారు. కమల్ హాసన్ నుంచి ఊహించని ఈ ప్రశంసలు అందుకున్న జోజూ జార్జ్, వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు.'థగ్ లైఫ్' సినిమాపై పూర్తి నమ్మకం ఉందని కమల్ పేర్కొన్నారు. "మేం ఒక గొప్ప చిత్రాన్ని రూపొందించాం. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకముంది. శాటిలైట్, ఓటీటీ హక్కులను మాత్రమే బయటివారికి ఇచ్చాం. పంపిణీ బాధ్యతలు మేమే చూసుకుంటున్నాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తే, మా నిర్మాణ సంస్థ ద్వారా ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలను అందిస్తాం" అని కమల్ హాసన్ వివరించారు.
Latest News