![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:10 PM
మనలోని పౌరుషం... వీరత్వం ఎన్నటికీ చల్లారిపోకూడదని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే 'సలసల మరిగే నీలోని రక్తమే...' పాటకు తన సంగీత, సాహిత్యాలతో ఎం.ఎం.కీరవాణి ప్రాణం పోశారన్నారు పవన్ కల్యాణ్ ఆయన స్వరాలు కథలోని భావోద్వేగాల్ని శిఖరస్థాయికి తీసుకెళ్తాయని చెప్పారు. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. ఎ.దయాకర్ రావు నిర్మాత. ఎ.ఎమ్.రత్నం సమర్పకులు. ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం ఈ చిత్రంలోని 'సల సల మరిగే నీలోని రక్తమే...' పాటని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు పవన్‌కల్యాణ్ మంగళవారం సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోకి వెళ్లి ఆయన్ని కలిశారు. ఇద్దరూ సంగీతం, సాహిత్యాల గురించి మాట్లాడుకున్నారు. కీరవాణి అందుకున్న ఆస్కార్ పురస్కారాన్ని పరిశీలించి, ఆయన్ని ప్రత్యేకంగా సన్మానించారు. పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం కీరవాణి ఎంత తపనతో స్వరాలు అందించారో స్వయంగా చూశా. వీరమల్లుకి ప్రాణం పోశారంటే అతిశయోక్తి కాదు. 'మొదటిసారి మీతో చేస్తున్నానంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు, అందుకు తగ్గట్టుగా ఉండాలి కదా' అనడం ఆయనలో అంకితభావాన్ని తెలియజేస్తోంది. ఆయనతో సంభాషణ ఎంతో సంతోషాన్నిచ్చింది. సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయమే తెలియలేదు. కీరవాణి దగ్గరున్న వయొలిన్లు చూసి, నేను వయొలిన్ నేర్చుకోవడం, జంటస్వరాల వరకూ నేర్చుకుని వదిలేయడం గుర్తు చేసుకున్నా. తెలుగు కథల్ని ప్రేమించే కీరవాణి తనకు అమితంగా నచ్చి 32 కథల్ని ఒక సంకలనంలా చేసుకున్నారు. వాటిని నాకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో ఆయన రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి. తెరపైన కనిపించేది రెండున్నర గంటల సినిమానే. కానీ ఆయన రోజుల తరబడి, నెలల తరబడి సినిమా కోసం తపిస్తూ సృజనాత్మక స్వరాలతో మైమరిపిస్తూ తెలుగు పాటని ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లార''న్నారు.
Latest News