|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 07:19 PM
తెలుగు తెరపై నవరసాలను ప్రవహింపజేసిన నటుడిగా కైకాల సత్యనారాయణ కనిపిస్తారు. దశాబ్దాల పాటు ఆయన ప్రస్థానం కొనసాగింది. అలాంటి సత్యనారాయణ ఆ మధ్య చనిపోయారు. ఆయన మేనల్లుడు రాంబాబు'కౌతరం' గ్రామంలో నివసిస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "సత్యనారాయణగారి గురించి వింటూ పెరిగాను. ఆ తరువాత ఆయన 'కౌతరం' వచ్చినప్పుడు మేము హైదరాబాద్ వెళ్లినప్పుడు ఆయనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడిని. అందువలన ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది. ఇండస్ట్రీకి వెళ్లిన కొత్తలో చాలా కష్టాలు పడ్డారు. అయితే తిరిగి వెనక్కి వెళ్లకూడదు అనుకున్నది సాధించిన తరువాతనే ఇంటికి వెళ్లాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ కష్టాలను భరిస్తూ వెళ్లారు" అని అన్నారు. ''సత్యనారాయణ గారిని రామారావుగారు ఎక్కువగా ప్రోత్సహించారు. వాళ్ల కాంబినేషన్ ఎదురులేకుండా కొనసాగింది. సత్యనారాయణ గారికి సొంత ఊరు అంటే చాలా ఇష్టం. సొంతఊరు చేపలు అంటే కూడా ఆయన ఎంతో ఇష్టాన్ని కనబరిచేవారు. సొంత ఊరు కోసం ఆయన ఎంతో చేశారు. ఎప్పుడూ సరదాగా, హుషారుగా ఉండేవారు. ఆయన నిరాశతో, నీరసంతో ఉండగా చూసినవారు లేరు. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అందరూ బాగా సెటిల్ అయ్యారు" అని అన్నారు
Latest News