|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:04 PM
కామెడీ టైమింగ్, సహజ నటనతో ప్రేక్షకులను అలరించే హీరో శ్రీవిష్ణు మరోసారి నవ్వుల పండుగ పంచడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. తాజాగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవిష్ణు తనదైన శైలిలో చేసిన సందడి అందరి దృష్టిని ఆకర్షించింది.ఈవెంట్‌కు శ్రీవిష్ణు చేతిలో ఓ కోతి బొమ్మను పట్టుకుని రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్టేజ్‌పై కూడా ఆ బొమ్మను వెంట ఉంచుకోవడంతో, దీని వెనుక ఉన్న కథేంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. దీనిపై శ్రీవిష్ణు స్పందిస్తూ సరదా వ్యాఖ్యలు చేశారు. "ఈ రోజు నా గ్రహస్థితి బాగోలేదని ఓ జ్యోతిష్యుడు చెప్పారు. అందుకే ఓ కోతి పిల్ల పక్కన ఉంటే అంతా మంచి జరుగుతుందని సలహా ఇచ్చారు. అయితే నిజమైన కోతిని తెచ్చుకుంటే కరుస్తుందేమోనన్న భయంతో ఈ బొమ్మను తీసుకొచ్చాను" అంటూ నవ్వులు పూయించారు. తన సినిమాలో కూడా జాతకాలను, గ్రహాలను బలంగా నమ్మే వ్యక్తి పాత్రలో నటిస్తున్నానని ఆయన చెప్పడంతో, ఇది సినిమా ప్రమోషన్‌లో భాగమని అందరికీ అర్థమైంది. ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News