|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:24 PM
స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాత్యహంకార వివక్ష చోటుచేసుకుంటోందంటూ తీవ్రంగా స్పందించారు. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'వీల్ ఆఫ్ ఫార్చ్యూన్' అనే రియాలిటీ షో వేదికగా ఈ సున్నితమైన అంశాన్ని ప్రస్తావించి, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్, ఈశాన్య రాష్ట్రాల వారు నిత్యం ఎదుర్కొంటున్న జాతి వివక్ష, అవమానాల గురించి చెప్పడంతో అక్షయ్ ఈ అంశంపై మాట్లాడారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, ఈ సమస్య తీవ్రతను తెలియజేసేందుకు మణిపూర్‌కు చెందిన తన మేకప్ ఆర్టిస్ట్ కిమ్‌ను వేదికపైకి పిలిచారు.ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. తనను చాలామంది 'చైనీస్', 'చింకీ', 'మోమో' వంటి పేర్లతో పిలుస్తూ ఎలా హేళన చేసేవారో వివరించారు. కిమ్ మాటలు విన్న అక్షయ్ కుమార్ చలించిపోయారు. "ఈ రోజు కిమ్ చెప్పిన తర్వాత, ఇలాంటివి నిజంగానే జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను," అని అన్నారు.అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, "ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై వివక్ష ఉంది. వారూ భారతీయులే. నేను, మీరు, ఇక్కడ ఉన్నవారు ఎంత భారతీయులమో, వారూ అంతే భారతీయులు," అని స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల్లో వారి త్యాగాలను గుర్తుచేస్తూ, "నాగా రెజిమెంట్ కార్గిల్, బంగ్లాదేశ్ యుద్ధాల్లో రక్తం చిందించింది. వారు ఈ దేశం కోసం ఎంతో చేశారు. వారు మన భారతీయులు" అని అక్షయ్ కుమార్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
Latest News