|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 02:57 PM
నిషేధిత ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేశారంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన సెలబ్రెటీలలో నటి మంచు లక్ష్మి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ విచారణకు సంబంధించి మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. బెట్టింగ్ యాప్ లకు సంబంధించి తాను ఎదుర్కొన్న విచారణ ఒకటైతే మీడియా మాత్రం మరో విషయాన్ని హైలైట్ చేసిందని ఆమె విమర్శించారు.మీడియాలో వచ్చిన వార్తలు తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్ వ్యవహారం ఎక్కడ మొదలైందనే విషయంపై దృష్టి సారించాల్సిన అధికారులు.. ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని విచారించాలని భావించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో డబ్బు ఎలా సమకూరుతోంది, ఎక్కడికి వెళుతోంది, ఉగ్రవాదులకు నిధులు సమకూరుతున్నాయా.. అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారని మంచు లక్ష్మి చెప్పారు. ఇవేవీ తనకు తెలియదని వివరించారు. వంద మంది ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని, అందులో తాను కూడా ఉన్నానని అధికారులు తనకు తెలిపారన్నారు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్ లు ఎవరు, ఎక్కడ ప్రారంభిస్తున్నారు.. వారిని పట్టుకొని శిక్షించడంలో అధికారులు ఎందుకు ఫెయిలవుతున్నారని మంచు లక్ష్మి ప్రశ్నించారు.
Latest News