|
|
by Suryaa Desk | Tue, Sep 09, 2025, 05:19 PM
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. సుమారు రూ. 60 కోట్ల మోసం కేసుకు సంబంధించి ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) రాజ్ కుంద్రాకు సమన్లు జారీ చేసింది. తొలుత బుధవారమే విచారణకు హాజరుకావాలని ఆదేశించినప్పటికీ, మరింత సమయం కావాలని రాజ్ కుంద్రా కోరడంతో ఈ నెల 15వ తేదీకి విచారణను వాయిదా వేశారు. ఈ దంపతులు తరచూ విదేశీ పర్యటనలు చేస్తుండటంతో వారు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు కొద్ది రోజుల క్రితమే ఈఓడబ్ల్యూ అధికారులు లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేసినట్లు సమాచారం.జుహూకు చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తాను లోటస్ క్యాపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్ అనే సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నానని, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు డైరెక్టర్లుగా ఉన్న ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీలో వ్యాపార విస్తరణ పేరుతో 2015 నుంచి 2023 మధ్య కాలంలో తాను రూ. 60.48 కోట్లు పెట్టుబడిగా పెట్టానని కొఠారీ తన ఫిర్యాదులో ఆరోపించారు. అయితే, ఆ డబ్బును వ్యాపారానికి కాకుండా శిల్ప, రాజ్ తమ సొంత అవసరాలకు వాడుకున్నారని ఆయన పేర్కొన్నారు.పన్నుల భారం తగ్గించుకునేందుకు రుణాన్ని పెట్టుబడి రూపంలో చూపించారని, నెలవారీగా రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఫిర్యాదుదారు తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా 2015 ఏప్రిల్‌లో రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్‌లో మరో రూ. 28.53 కోట్లు బదిలీ చేసినట్లు ఆయన వివరించారు. 2016 ఏప్రిల్‌లో శిల్పాశెట్టి వ్యక్తిగత హామీ ఇచ్చారని, కానీ అదే ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని కొఠారీ ఆరోపించారు. ఈ కేసులో భాగంగా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆడిటర్‌కు కూడా పోలీసులు సమన్లు పంపారు.
Latest News