|
|
by Suryaa Desk | Tue, Sep 09, 2025, 05:17 PM
సాధారణంగా చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన సినిమాలు భారీ వసూళ్లను రాబట్టడమనేది మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి అలాంటి ఒక రేర్ ఫీట్ జరిగింది. ఆ సినిమా పేరే 'సు ఫ్రమ్ సో'. జులై 25వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. దర్శకుడు జేపీ తుమినాడ్ అల్లుకున్న ఈ కథ, ఏ అంశం చుట్టూ తిరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: అది మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉండే ఒక మారుమూల గ్రామం. అక్కడ కష్టపడి పనిచేసేవారు తక్కువ. కబుర్లతో కాలక్షేపం చేసే తాగుబోతులు ఎక్కువ. అలాంటి ఆ ఊరికి రవీంద్ర (షానీల్ గౌతమ్) పెద్దగా ఉంటాడు. మంచివాడు .. ధైర్యవంతుడు అనే పేరు ఆయనకి ఉంటుంది. నడి వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా, ఊళ్లో ప్రతి కార్యక్రమానికి ముందు నిలబడుతూ ఉంటాడు. పెత్తనం .. పెద్దరికం తమకి అందకుండా చేస్తున్న అతనిపై చాలా మందికి జలస్ ఉంటుంది. ఇక అదే ఊళ్లో అశోక్ ( జేపీ తిమినాడ్) నివసిస్తూ ఉంటాడు. ఆ విలేజ్ అమ్మాయిల ముందు రవీంద్ర హీరోయిజాన్ని భరించలేని యువకులలో అతను కూడా ఒకడు. అలాంటి అతని కంట్లో ఒక అందమైన యువతి పడుతుంది. టౌన్లో చదువుకుంటూ ఆ ఊరికి వచ్చిన ఆమె పట్ల అతను ఆకర్షితుడవుతాడు. స్నానాల గదిలో ఉన్న ఆమెను రహస్యంగా చూడటానికి ప్రయత్నిస్తాడు. అటుగా వచ్చినవారికి తనపై అనుమానం రాకుండా ఉండటం కోసం తనకి దెయ్యం పట్టనట్టుగా ప్రవర్తిస్తాడు. అశోక్ ఆడిన అబద్ధం వలన, అతనికి 'సులోచన' అనే దెయ్యం పట్టిందనే నిర్ణయానికి ఆ ఊళ్లోని వాళ్లంతా వస్తారు. అశోక్ ను ఒక గదిలో బంధిస్తారు. అతనికి పట్టిన దెయ్యాన్ని వదిలించడం కోసం, మాంత్రికుడైన కరుణాకర్ గురూజీ(రాజ్ బీ శెట్టి)ని కర్ణాటక నుంచి పిలిపిస్తారు. గురూజీ అడుగుపెట్టిన తరువాత అక్కడ ఏం జరుగుతుంది? అశోక్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.
Latest News