|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 10:10 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కలయికలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన యాక్షన్ చిత్రం 'కూలీ'. ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్, ప్రెస్‌మీట్‌ను ఘనంగా నిర్వహించారు.కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. తనకు ఎప్పుడూ కొత్తదనంతో కూడిన పాత్రలు చేయడం ఇష్టమని తెలిపారు. ‘కూలీ’ కథ విన్నప్పుడు, లోకేశ్ చెప్పిన సైమన్ పాత్ర ఎంతో నచ్చిందని చెప్పారు. ఈ పాత్ర దాదాపు హీరోతో సమానంగా ఉంటుందని, రజనీకాంత్ ఆమోదించారా అని తాను అడిగానని తెలిపారు. తన కెరీర్‌లో మొదటిసారి లోకేశ్ కథ చెబుతుండగా రికార్డు చేసుకున్నానని, ఇంటికి వెళ్లి మళ్లీ మళ్లీ విన్నానని చెప్పారు. ఈ చిత్రంలో తనది నెగెటివ్ పాత్ర అయినప్పటికీ, పనిచేసిన అనుభూతి మాత్రం పాజిటివ్‌గా ఉందని నాగార్జున అన్నారు. రజనీకాంత్ సెట్‌లో తనతో చాలా గొప్పగా వ్యవహరించారని, ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని నాగార్జున తెలిపారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ..కూలీ తన డైమండ్ జూబ్లీ చిత్రమని చెప్పారు. తెలుగులో రాజమౌళి ఎలాగో, తమిళంలో లోకేశ్ కనకరాజ్ అలా అని ప్రశంసించారు. నాగార్జున సైమన్ పాత్రలో అద్భుతంగా నటించారని, ‘బాషా-ఆంటోనీ ఎలాగో, కూలీ-సైమన్ అలా ఉంటారని’ అన్నారు. నాగార్జున ఈ పాత్రను ఒప్పుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఆయన డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదని అన్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అద్భుతంగా ఉందని, సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.దర్శకుడు లోకేశ్ కనకరాజ్ మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టును నమ్మి తనకు ఇచ్చినందుకు రజనీకాంత్‌కు, నిర్మాతలకి కృతజ్ఞతలు తెలిపారు. నాగార్జునను ఒప్పించడం పెద్ద సవాలు అని, దాదాపు ఏడుసార్లు కథ చెప్పిన తర్వాత ఆయన అంగీకరించారని చెప్పారు. నాగార్జున ఎంత అద్భుతంగా నటించారో ప్రేక్షకులు చూడబోతున్నారని అన్నారు.
Latest News