|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 04:48 PM
టాలీవుడ్ ప్రముఖ యాక్టర్ వాసుకీ(పాకీజా) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. 90వ దశకంలో పలు చిత్రాల్లో నటించిన ఆమె.. అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాకీజా పాత్రతో బాగా ఫేమస్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. అయితే ఆమె ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. ఇక ఇటీవల పాకీజా దీనస్థితి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెకు అండగా నిలిచారు. ఒక్కొక్కరు తమకు తోచిన సాయం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన పాకీజా.. తనకు పూట గడవడమే గగనంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'నేను గతంలో కష్టాల్లో ఉన్నప్పుడు రూ.7.5 లక్షల దాకా సాయం అందింది. ఆ డబ్బు నేను వృథగా ఖర్చు చేయలేదు. మూడున్నర లక్షల అప్పు తీర్చేసుకున్నాను. హైదరాబాద్‌లో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను. వంట సామాగ్రి కొనడం.. ఇక్కడి నుంచి చెన్నై, కారైకూడి, మధురై వెళ్లడం.. ఇలా వీటికే డబ్బంతా అయిపోయింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళనాడు వెళ్లిపోయాను. అక్కడ రేకుల ఇంటికి వెయ్యి రూపాయలు అద్దె కట్టడానికి కష్టమైపోయింది. ఇంట్లో పాచి పని చేస్తానని చెప్పినా ఎవరూ పనివ్వ లేదు. ఎందుకంటే నేను నటిని అని దూరం పెడుతున్నారు. ఆరు నెలల్లో పిచ్చిదాన్ని అయిపోతానేమో అనిపించింది. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. పది రూపాయల ఇడ్లీ పిండి కొనుక్కుంటే అది రెండు రోజులు వచ్చేది. ఉదయం, సాయంత్రం ఇడ్లీ చేసుకునేదాన్ని. అలా నా జీవితాన్ని గడిపాను. నాకు సాయం చేసిన వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Latest News