|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 02:34 PM
రెబల్ స్టార్ ప్రభాస్ తన 46వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేయగా, అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.గురువారం ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని, నిర్మాణ సంస్థ ఈ ప్రకటన చేసింది. "చరిత్రలోని మరుగునపడిన అధ్యాయాల నుంచి వస్తున్న ఒక సైనికుడి సాహస గాథ ఇది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన వెనుక బ్రిటిష్ జెండా మంటల్లో కాలిపోతున్న దృశ్యం సినిమాపై అంచనాలను పెంచుతోంది.1940ల కాలం నాటి చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సరసన కథానాయికగా ఇమాన్వి నటిస్తున్నారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, జయప్రద వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలు ఉండటంతో సెట్స్ నుంచి ఏ చిన్న విషయం బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంటోంది.
Latest News