|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 02:28 PM
హాలీవుడ్ లో ఫ్రాంఛైజీ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ వైపు నుంచి వచ్చిందే 'ఫైనల్ డెస్టినేషన్'. ఇంతవరకూ ఈ ఫ్రాంఛైజీ నుంచి 5 భాగాలు వచ్చాయి. 2011 తరువాత 6వ భాగంగా ప్రేక్షకులను పలకరించిందే 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్'. జాక్ లిపోవ్ స్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఇంగ్లిష్ తో పాటు హిందీ .. తెలుగు .. తమిళ భాషల్లో 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: 'స్టెఫీ' ఓ కాలేజ్ లో చదువుతూ ఉంటుంది. తరచూ ఆమెకి ఒక పీడకల వస్తూ ఉంటుంది. తన అమ్మమ్మ ఐరిస్ కి సంబంధించిన కల అది. 50 ఏళ్ల క్రితం ఆమె అమ్మమ్మ ఐరిస్ .. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి 'స్కై వ్యూ' అనే ఒక రెస్టారెంట్ కి వెళుతుంది. ఎత్తయిన టవర్ తరహాలో .. చుట్టూ గ్లాస్ ఫిటింగ్ తో నిర్మించిన రెస్టారెంట్ అది. తాను గర్భవతిని అనే విషయం అక్కడికి వెళ్లిన తరువాతనే ఆమెకి తెలుస్తుంది. ఒక కుర్రాడి ఆకతాయి తనం వలన ఆ టవర్ పడిపోతుందనే విషయం ఐరిస్ కి ముందుగానే తెలిసిపోతుంది. అక్కడికి వచ్చిన వారిని ఆమె అప్రమత్తం చేస్తూ ఉండగానే, ఆ టవర్ కుప్పకూలిపోతుంది. ఆమె కొంతమందిని కాపాడ గలుగుతుంది. మిగతా వాళ్లంతా చనిపోతారు. తనని కలవర పెడుతున్న ఈ కలను గురించి చెప్పడం కోసం, ఓ పాడుబడిన ఇంట్లో ఒంటరిగా ఉంటున్న అమ్మమ్మ దగ్గరికి స్టెఫీ వెళుతుంది. స్కై వ్యూ రెస్టారెంట్ లో జరిగిన ప్రమాదం నిజమేనని ఐరిస్ చెబుతుంది. ఆ ప్రమాదంలో చనిపోకుండా తాను కాపాడబడిన వాళ్లంతా కూడా ఆ తరువాత ఒక్కొక్కరుగా .. చిత్రమైన పరిస్థితులలో చనిపోతూ వచ్చారని అంటుంది. ఆ రోజున ఆ రెస్టారెంట్ కి వచ్చినవారి వారసులను కూడా మృత్యువు వెంటాడుతోందనే విషయం తన పరిశీలనలో తేలిందని చెబుతుంది. తాను ఇంతవరకూ బ్రతికి ఉండటమే గొప్ప విషయమనీ, ఇక ఇప్పుడు తన వంతు వచ్చిందని అంటుంది. 'స్కై వ్యూ' రెస్టారెంట్ లో చనిపోయినవారి కుటుంబ సభ్యులను సైతం ఏదో శక్తి వెంటాడుతోందనీ, అయితే తమ కుటుంబ సభ్యులను ఆ శక్తి నుంచి ఎలా కాపాడుకోవాలనే విషయంపై తాను ఒక పుస్తకం రాశానని చెబుతుంది. ఆ పుస్తకంలో తాను రాసిన విషయాలకు తగినట్టుగా నడుచుకోమని హెచ్చరిస్తుంది. ఐరిస్ అనుభవంతో రాసిన ఆ పుస్తకంలో ఏముంటుంది? అది చదివిన స్టెఫీ తన కుటుంబ సభ్యులను కాపాడుకోగలుగుతుందా? అనేది మిగతా కథ.
Latest News