|
|
by Suryaa Desk | Mon, Sep 08, 2025, 09:14 AM
ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తిపై పోలీసులను ఆశ్రయించారు. సుమారు రెండేళ్లుగా ఇంటి అద్దె చెల్లించకుండా, అడిగినందుకు తనను బెదిరిస్తున్నాడని ఆయన చెన్నైలోని కేకే నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పోలీసులకు ఎస్పీ చరణ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, చెన్నై సాలిగ్రామంలోని సత్యా గార్డెన్ అపార్ట్‌మెంట్‌లో ఆయనకు ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్‌లో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సహాయ దర్శకుడు తిరుజ్ఞానం అద్దెకు దిగారు. నెలకు రూ. 40,500 అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, రూ. 1.50 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు చరణ్ తెలిపారు. అయితే, ఇంట్లోకి దిగినప్పటి నుంచి గడిచిన 25 నెలలుగా తిరుజ్ఞానం అద్దె చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు.ఇటీవల అద్దె బకాయిల గురించి అడగ్గా, తిరుజ్ఞానం తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తీవ్రమైన బెదిరింపులకు పాల్పడినట్లు ఎస్పీ చరణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు రావాల్సిన అద్దె డబ్బులు ఇప్పించి, వెంటనే ఇంటిని ఖాళీ చేయించాలని పోలీసులను కోరారు.ఎస్పీ చరణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేకే నగర్ పోలీసులు తిరుజ్ఞానంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రముఖ గాయకుడికే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Latest News