|
|
by Suryaa Desk | Sun, Sep 07, 2025, 08:02 PM
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇచ్చిన ఓ భారీ విరాళం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన భక్తితో చేసిన పనికి కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలంటూ హితవు పలుకుతున్నారు.ముంబైలోని ప్రఖ్యాత లాల్‌బాగ్చా రాజా గణపతి మండపానికి అమితాబ్ బచ్చన్ ఇటీవల రూ. 11 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఆయన నేరుగా వెళ్లనప్పటికీ, తన బృందం ద్వారా చెక్కును మండల్ కార్యదర్శి సుధీర్ సాల్వికి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇదే ఇప్పుడు ఆయనపై విమర్శలకు కారణమైంది.ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం భారీ వరదలతో అతలాకుతలమవుతోంది. 1988 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారి. వేల గ్రామాలు నీట మునిగి, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమితాబ్ వరద బాధితులకు కాకుండా, గణపతి మండపానికి విరాళం ఇవ్వడం సరికాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.‘‘ఈ డబ్బును పంజాబ్ వరద బాధితులకు ఇచ్చి ఉంటే ఎంతో మేలు జరిగేది’’, ‘‘దేవుడికి కాదు, అవసరంలో ఉన్న మనుషులకు సాయం చేయండి’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరైతే, ‘‘సెలబ్రిటీలు విరాళాల విషయంలో సమతౌల్యం పాటించాలి. మతపరమైన కార్యక్రమాల కన్నా మానవత్వానికే పెద్ద పీట వేయాలి’’ అని సూచిస్తున్నారు. మొత్తానికి బిగ్ బీ విరాళం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు కేంద్రంగా మారింది.
Latest News