|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 08:25 PM
సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన ‘ఆఖరి పోరాటం’ సినిమాపై అగ్ర నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ భారీ విజయం సాధించిన చిత్రంలో తానొక బొమ్మలా మాత్రమే ఉన్నానని, అసలు విజయం దర్శకుడు రాఘవేంద్రరావు, నటి శ్రీదేవిలకే దక్కుతుందని చెప్పారు. నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో పాల్గొన్న నాగార్జున, తన కెరీర్ ఆరంభంలోని అనేక సంగతులను గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కమర్షియల్ చిత్రాల్లో ‘ఆఖరి పోరాటం’ నాకు పెద్ద విజయాన్ని అందించింది. కానీ నిజం చెప్పాలంటే ఆ సినిమాలో నేను చేసింది ఏమీ లేదు. దర్శకుడు రాఘవేంద్రరావు, శ్రీదేవికే క్రెడిట్ దక్కుతుంది’’ అని నాగార్జున తన అనుభవాన్ని పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో తనను ప్రేక్షకులు ‘నాగేశ్వరరావు గారి అబ్బాయి’గానే చూసేవారని, అయితే ‘మజ్ను’ చిత్రం తర్వాతే తనలోని నటుడిని గుర్తించారని ఆయన తెలిపారు.ఇదే కార్యక్రమంలో ‘గీతాంజలి’ సినిమా అవకాశం ఎలా వచ్చిందో కూడా నాగార్జున వివరించారు. ‘‘మణిరత్నం తీసిన ‘మౌనరాగం’ చూసి ఆయన దర్శకత్వంలో నటించాలని బలంగా అనుకున్నా. ఆయన ఎక్కడ వాకింగ్‌కు వెళతారో తెలుసుకుని, దాదాపు నెల రోజుల పాటు ఆయన వెంటపడ్డాను. మొదట ఆ కథను తమిళంలో తీయాలని ఆయన అనుకున్నారు. కానీ, నేను పట్టుబట్టి తెలుగులో తీయమని ఒప్పించాను. అలా ‘గీతాంజలి’ నాకు మరపురాని హిట్‌గా నిలిచింది’’ అని వెల్లడించారు.తాను నటుడిగా మారడానికి నాగార్జున ప్రోత్సాహమే కారణమని జగపతి బాబు ఇదే షోలో తెలిపారు. నాగార్జున, జగపతి బాబుల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం ‘జీ 5’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతోంది.
Latest News