|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:34 AM
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సన్ ఆఫ్ సర్దార్ -2'. పదేళ్ళ క్రితం వచ్చిన 'సన్నాఫ్ సర్దార్'కు ఇది సీక్వెల్. ఈ నెల 25న రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వారం వెనక్కి వెళ్ళిపోయింది. ఆగస్ట్ 1న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. మూవీని పోస్ట్ పోన్ చేయడానికి ఎలాంటి కారణం చెప్పకపోవడంతో రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.జూలై 18 శుక్రవారం యశ్ రాజ్ ఫిలిమ్స్ మోహిత్ సూరి దర్శకత్వంలో నిర్మించిన 'సయారా' మూవీ విడుదలైంది. కొత్త నటీనటులతో తీసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలి రోజునే ఈ సినిమా ఏకంగా రూ. 20 కోట్లకు పైగా నెట్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ రకంగా చూస్తే ఓ భారీ విజయాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ అందుకున్నట్టే. 'సయారా'కు వస్తున్న రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని, మరో వారం పాటు దాని హవా సాగుతుందనే అంచనాతో 'సన్ ఆఫ్ సర్దార్ -2' మూవీ విడుదలను వారం వెనక్కి జరిపారనే టాక్ వినిపిస్తోంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ... ఇక్కడో ఆసక్తికరమైన అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. సరిగ్గా పదేళ్ళ క్రితం అజయ్ దేవ్ గన్ 'సన్ ఆఫ్ సర్దార్' మూవీతో అప్పట్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ తీసిన 'జబ్ తక్ హై జాన్' మూవీ విడుదలైంది. ఇప్పుడు మరోసారి వన్ వీక్ గ్యాప్ తో వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ జరగాల్సింది కానీ అజయ్ దేవ్ గన్ ఓ అడుగు వెనక్కి వేశారు.మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే... 'సన్ ఆఫ్ సర్దార్ 2' విడుదలైన రెండు వారాలకే ఆగస్ట్ 14న యశ్ రాజ్ ఫిలిమ్స్ కే చెందిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'వార్ 2' విడుదల కాబోతోంది. సో... యశ్ రాజ్ ఫిలిమ్స్ రెండు ప్రాజెక్ట్స్ నడుమ 'సన్ ఆఫ్ సర్దార్ 2' వస్తోందన్నమాట. ఇలా వారం వెనక్కి వెళ్ళడం వల్ల సినిమా ప్రచారాన్ని మరింత పకడ్బందీగా అజయ్ దేవ్ గన్ బృందం చేసుకుంటుందేమో చూడాలి.
Latest News