![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 06:05 PM
లోక నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతి హాసన్. సింగర్, మ్యూజిక్ కంపోజర్ గా కెరీర్ ను ప్రారంభించిన శృతి.. అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంటుంది అనుకున్నారు కానీ, అమ్మడు వరుస పరాజయాలను అందుకొని ఐరెన్ లెగ్ గా ముద్ర వేయించుకుంది. అయినా పట్టువదలకుండా కష్టపడి గబ్బర్ సింగ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం శృతి ప్రేమ, పెళ్లి అనే ఆలోచన లేకుండా కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది. తాజాగా ఆమె కూలీ సినిమాలో నటిస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో శృతి పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తుందని చెప్పుకొచ్చింది. ' నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడం కోసం నేనెంతో కష్టపడ్డాను. కానీ, ఆ బాధ్యతలను ఒక చిన్న కాగితం మీద పెట్టాలంటే భయమేస్తుంది. పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి చేసుకొని తల్లిఅయ్యాకా.. విడిపోయి ఒక సింగిల్ మదర్ గా ఉండాలనుకోవడం లేదు. ఎందుకంటే సింగిల్ మదర్ కష్టాలు నాకు తెలుసు. నా లైఫ్ లో ఒకసారి పెళ్లి దగ్గరవరకు వెళ్లి వచ్చాను. చేసుకోవాలనుకున్నాను. కానీ, ముడిపడలేదు. పెళ్లి అనేది ఇద్దరు మనుషులకు సంబంధించిన విషయం కాదు. రెండు జీవితాల బాధ్యత. ఇద్దరిలోనూ విధేయత ఉండాలి. నిబద్దత ఉండాలి. ఒకరిలో ఉంటే అది నిలవదు. ఒంటరిగా ఉండడం నాకు కొత్తేమి కాదు. ఎన్నో విషయాలను ఒంటరిగా ఉన్నప్పుడే నేర్చుకున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. రెండు సార్లు ప్రేమ విఫలమయ్యాక శృతి ఇలా మాట్లాడడంలో తప్పు లేదు అని చెప్పొచ్చు. అయితే శృతి లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందా.. ? మధ్యలో ఇంకో ప్రేమను వెతుక్కుంటూ వెళ్తుందా.. ? అనేది తెలియాల్సి ఉంది.
Latest News